

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకో లుక్ తో అందరి దృష్టి తనపై పడేటట్టు చూసుకుంటున్నారు. ఇన్నాళ్లూ చంద్రబాబుని ఎప్పుడూ ఒకే డ్రెస్‌లో చూసిన తెలుగు ప్రజలు తాజాగా అయన కొత్త లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు . ప్రచారంలో భాగంగా ఎక్కడికిపోతే అక్కడ.. అలా మారిపోతూ చంద్రబాబు అందరివాడులా మారిపోతున్నారు.
నిన్న నల్ల రంగు చొక్కాతో అసెంబ్లీకి…
ఇక చంద్రబాబు అనగానే అందరికి గుర్తుకువచ్చే పసుపు పచ్చ డ్రెస్. చంద్రబాబు అంటే పసుపు చొక్కా అనేంతలా ఒకే విధమైన లుక్ తో కనిపించేవాడు. కానీ శుక్రవారం జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన నల్లచొక్కాతో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తోందని, కేంద్రంపై నిరసన తెలుపుతూ మొట్టమొదటిసారిగా ఒక సీఎం నల్లచొక్కాతో అసెంబ్లీ కి రావడం సంచలనం సృష్టించింది.
నేడు ఆటో డ్రైవర్ దుస్తుల్లో…
అలాగే శనివారం ఆటో డ్రైవర్లు ధరించే ఖాకీ చొక్కా ధరించి అందరిలోనూ ఉత్సాహం నింపారు సీఎం చంద్రబాబు. ఆ రంగు చొక్కా ధరించడమే కాదు, స్వయంగా ఆయన ఆటో కూడా నడిపి సందడి చేశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం ఇందుకు వేదికైంది. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం ఉదయం ఆయన నివాసానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఈ నేపథ్యం లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..”నా జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆటో నడుపుతూ డ్రైవర్లు వారి కుటుంబాన్ని పోషిస్తుంటే, రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని నేను చూస్తున్నా ..” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చదవండి: రక్తం పొంగుతోందంటూ కేంద్రంపై ఊగిపోయిన చంద్రబాబు: మనిషివేనా? అంటూ బీజేపీ ఘాటు కౌంటర్








