న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా బీజేపీయేతర పార్టీలు ఏకం కాబోతున్నాయా?.. జాతీయ ఐక్య కూటమిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా?.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అందుకేనా?.. ప్రస్తుత పరిణామాల్ని గమనిస్తుంటే అలాగే కనిపిస్తోంది. గురువారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి అక్కడ జాతీయ స్థాయి నేతల్ని కలవబోతున్నారు.
చదవండి: 2019 పార్టమెంట్ పోల్: పట్టు లేని.. ప్రాంతీయ పార్టీలు
ఈ పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురితో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, చంద్రబాబు గురువారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా భేటీ అవుతారనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ స్థాయి నేతలతో సమావేశంలో ప్రధానంగా జాతీయ ఐక్య కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీయేతర పార్టీలతో జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు చేసేందుకు బాబు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగడుతూనే.. ఆయన ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత శనివారం కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్‌లతో పాటు పలువురు నేతల్ని కలిశారు. అంతేకాదు, ఇకమీదట తాను తరచూ ఢిల్లీకి వస్తుంటానని కూడా చంద్రబాబు ప్రకటించారు. చెప్పినట్లుగానే మళ్లీ గురువారం ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.