త్వరలో మహాకూటమి అభ్యర్థుల జాబితా: ప్రతిష్టాత్మక పోరులో.. గెలుపు గుర్రాలకే సీట్లు

Mahakutami3
- Advertisement -

Mahakutami8

హైదరాబాద్:  తెలంగాణ ఎన్నికలను మహాకూటమి.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల జాబితా విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాల్సి వస్తోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయంతో కూటమి నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

దీనికి స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైనా.. ఆయా నేతలను బుజ్జగించి, సర్దుబాటు చేసుకోవాలంటూ నియోజకవర్గ నేతలకు సంకేతాలిచ్చారు. మొత్తానికి ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం ఆలస్యం చేయకుండా..  త్వరలో మహా కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నామని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ప్రకటించారు. ఏఐఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం.. ఆయన పొత్తుల విషయమై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని తెదేపా కార్యాలయంలో కోదండరాం, రమణ, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యంపై మాట్లాడుతూ పొత్తులు, సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌ తీరని జాప్యం చేస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే  మహాకూటమికి మరింత నష్టం జరిగే అవకాశాలున్నాయని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తాజా ప్రతిపాదన… టీడీపీకి 14, టీజెఎస్ 8, కమ్యూనిస్టులకు 2 ఇచ్చేందుకు సుముఖుత

టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 2 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రతిపాదించింది. టీడీపీ 18, టీజేఎస్ 12, కమ్యూనిస్టులు 5 అడుగుతున్నారు. అలాగే భు తాజా ప్రతిపాదనలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమై.. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియాతో వెళ్లి కలిశారు. సీట్ల సర్దుబాటుపై రాహుల్‌కు వారిద్దరూ వివరించారు. అయితే గురువారం చంద్రబాబునాయుడు, రాహుల్ గాంధీతో గంట సేపు సమావేశమయ్యారు. రాబోయే దేశ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని తమకు 18 సీట్లు కావాలని కోరినట్టు తెలిసింది. ఒక దశలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినా తెలుగుదేశానికి బలంగా ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థులు గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అదనంగా కోరుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మహాకూటమి పొత్తులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయని కుంతియా తెలిపారు. త్వరలో  అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

ఇతర పార్టీల నేతలకు బుజ్జగింపులు…

తాజా ప్రతిపాదనలతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమిలోని ఇతర పార్టీల నేతలతో బుజ్జగింపులు మొదలుపెట్టారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీలు ఢిల్లీకి వెళ్లి.. గురువారం ఉదయం పదకొండు గంటలకు జరిగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఇందులో అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేయనుంది.

తొలుత నవంబర్ 1న అనుకున్నా…2.. ఇప్పుడు 8కి చేరిన అభ్యర్థుల విడుదల తేదీ?

వాస్తవానికి నవంబర్ 1న మహా కూటమితో సంబంధం లేకుండా.. మిగిలిన ప్రాంతాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. కానీ,  అ రోజు అష్టమి కారణంగా అభ్యర్థుల జాబితాను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ తేదీ కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది.బహుశా 8వ తేదీన తెలియవచ్చునని అంటున్నారు. ఢిల్లీలో ఉత్తమకుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో 8 వ తేదీన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అంతకన్నా ముందు తొలి జాబితాలో కనీసం 45 నుండి 55 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

కూటమిలో ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల పరోక్షంగా టీఆర్ఎస్‌కు ప్రయోజనం కలిగేలా చేయకూడదనేది కాంగ్రెస్ పార్టీ అభిమతంగా కనిపిస్తోంది. ఎందుకంటే బలమైన తమ అభ్యర్థులను కాదని.. బలహీనమైన కూటమి అభ్యర్థులను నిలబెడితే అసంతృప్తులు చెలరేగి, అక్కడ ఓడిపోయే అవకాశాలున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు.అలాగే తాము బలహీనంగా ఉన్న చోట అవతల కూటమి అభ్యర్థులు ధీటైన వారుంటే సంతోషంగా ఇస్తామని పేర్కొంటున్నారు.  తాము గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితులలోను వదులుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది. టీజేఎస్, సీపీఐలకు తక్కువ స్థానాలను కేటాయించడం వెనుక కారణం కూడా అదేనంటున్నారు.

అంతేకాకుండా టీజేఎస్‌కు జంటనగరాలు,  ఉస్మానియా యూనివర్శీటి పరిధిలోని నియోజకవర్గాలు, తెలంగాణ జిల్లాల్లో యువత ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో కోరుతున్నారు. కమ్యూనిస్టులు నోముల నర్సింహయ్యలాంటోళ్లు టీఆర్‌ఎస్‌ చేరిపోవడంతో వారికి స్థానికంగా ఓట్ల బలం ఉన్నా, నాయకత్వ బలం లేకపోవడంతో ఐదు స్థానాలు కావాలని కోరుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి తెలుగువారు అధికంగా ఉండే ఖమ్మం, నల్గొండ జిల్లాలో, హైదరాబాద్ కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి. యువ తెలంగాణ పార్టీ తరఫున భువనగిరి నియోజకవర్గం నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డికి సీటు కేటాయించే అవకాశాలున్నాయి..

టీజేఎస్ కు ఇచ్చే సీట్లు.. ఇవి అంటున్నారు..

మల్కాజిగిరి, చెన్నూరు, రామగుండం, వరంగల్‌తూర్పు లేదా వరంగల్‌ పశ్చిమల్లో ఒకటి, మెదక్‌, దుబ్బాక, మహబూబ్‌నగర్‌,  ఆలేరు, ఎల్లారెడ్డి.. మిర్యాలగూడ, షాద్‌నగర్‌, మేడ్చల్‌ స్థానాలను  పట్టుబడుతోంది. మరో 3 ఎక్కడైనా ఫర్వాలేదని టీజేఎస్ కోరుతోంది.

తెలుగుదేశం అడిగే సీట్లు.. ఇలా అంటున్నారు..

కూకట్‌పల్లి, సత్తుపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, చార్మినార్‌, బాల్కొండ, జూబ్లీహిల్స్‌ లేదా ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌ లేదా సికింద్రాబాద్‌, , నర్సంపేట లేదా వరంగల్‌ తూర్పు..శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, కోరుట్ల, మక్తల్‌, దేవరకద్ర లేదా వనపర్తి. తెదేపా పక్షాలు కోదాడ

కమ్యూనిస్టులు…ఇవి కోరుతున్నారు..

మల్కాజ్‌గిరి, పినపాక, కొత్తగూడెం, వైరా, ఆలేరు , లేదా మునుగోడు, హుస్నాబాద్‌, బెల్లంపల్లి, దేవరకొండ, మంచిర్యాల, కుత్బుల్లాపూర్‌ ఈ చోట్ల తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని వారు పేర్కొంటున్నారు. అయితే వైరా, బెల్లంపల్లి రెండు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నట్టు సమాచారం.

గెలుపు అవకాశాలున్న.. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా లాంటి వారిని వదులుకోవద్దు..

యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డిలాంటి వాళ్లను కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టకూడదనే కృతనిశ్చయంతో ఉండటం, భువనగిరి నియోజకవర్గంలో తప్పక గెలిచే అవకాశాలుండటం వల్ల జిట్టాకు కాంగ్రెస్ తరఫున సీటు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో జిట్టాలాంటి వారిని వదులుకోకూడదని అంతర్గత సమావేశాల్లో కాంగ్రెస్ ప్రముఖులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ బృంద సభ్యులు చేసిన సర్వేలో కొన్ని తెలుగుదేశం అభ్యర్థులకు, అలాగే భువనగిరి నియోజకవర్గం నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డికి గెలిచే అవకాశాలున్నాయని నివేదికలు వచ్చాయి.

ఏది ఏమైనా మహాకూటమి తరఫున పోటీ చేస్తే వీరి బలం, వారి బలం కలిసి వచ్చి అధికారం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 119 సీట్లలో 70 స్థానాల్లో గెలుపొందినా తెలంగాణలో అధికారం హస్తగతమవుతుంది.ఒకవేళ తాము అధికారంలోకి వస్తే.. భాగస్వామ్య పార్టీలకు ఇతర నామినేటేడ్ పదవులు, కార్పొరేషన్ పదవులను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తోంది.  ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భాగస్వామ్య పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లను తీసుకొనేందుకు కొంత సానుకూలతను వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎన్నో చూడాలి..ఖర్చులు, కార్యకర్తలు, ఏర్పాట్లు, సభలు.. ఎన్ని ప్లాన్ చేయాలి..

ఎన్నికలనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని..ఎన్నికల కోడ్ రాకముందే అన్ని చోట్లకు వెళ్లాలి. ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడసలే బ్యాంకుల్లో డడ్బులు వేయడానికి లేదు, తీయడానికి లేదు..ముందస్తుగానే అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా ముఖ్య నేతలతో సభలు ఏర్పాటు చేయాలి. అవతలి అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోయి..వారూ రెండో రౌండ్ కి వెళ్లిపోతే.. వెనుకబడిపోతామని అంటున్నారు. అందుకే త్వరగా పొత్తుల వ్యవహారాలను తేల్చాలని కోరుతున్నారు..అలాగైతే అభ్యర్థులు త్వరగా ప్రచారంలోకి వెళతారని లేదంటే వెనుకబడిపోతారని మహాకూటమి ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచార సభలతో ముందడుగు వేస్తోంది. ఇంకా అభ్యర్థులు తేలకపోతే..కొన్ని ప్రాంతాలను వదిలేసే అవకాశాలున్నాయని..   మా దగ్గరకు రాలేదు..మేమెందుకు ఓటేయాలని ప్రజలంటే..ఏం చెబుతామని ఆశావాహులు పేర్కొంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టాటజీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ వ్యవహారాలను నానబెడతారనే అపవాదులున్నాయి. ఎప్పుడు కూడా చివరి వరకు మీడియాతో సహా అందరినీ టెన్షను పెడుతుంటారు. అలాగే ముందుగా కొన్ని ఫీలర్లు రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ కలగాపులగంలా తయరవుతాయి. సీటు వచ్చేదెవరికో, రానిదెవరికో కూడా తెలియదు.. ఇక చూసి..చూసి.. ఒక్కసారి షాక్ ఇస్తారు.. అసంతృప్తి వాదులు ఇటూ, అటూ జంప్ లు చేసే అవకాశం లేకుండా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. ఈయన పార్టీలో ఉన్నవారికి, అవతలివారికి కూడా ఏ చిన్న  అవకాశం కూడా ఇవ్వరని చంద్రబాబు సంగతి తెలిసిన పలువురు తెలంగాణ రాజకీయనేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -