
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఈరోజు నుంచి శాఖల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఈరోజు ఆయన ఆర్ధిక, రెవెన్యూ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు.
అయితే ఈ సమీక్షా అయ్యాక సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొననున్నారు. ఇక ఆదివారం కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. మళ్ళీ సోమవారం నుంచి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో శాఖల సమీక్షను కొనసాగించనున్నారు.
ఈ సమీక్షల్లో ఆయా శాఖల స్థితిగతులు, ఏ స్థాయిలో మార్పుచేర్పులు చేయాలి? ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనేదీ జగన్ అంచనా వేయనున్నారని సమాచారం. ఆ తర్వాత జూన్ 8న మంత్రివర్గ విస్తరణ ఉంటుదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ రోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వేదికగా కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర నూతన మంత్రివర్గం సమావేశం కానుంది.
అలాగే జూన్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ స్పీకర్ ఎంపికతో పాటు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు సమాచారం.








