న్యూఢిల్లీ: అతిలోక సుందరి శ్రీదేవి మరణం లెక్కకి మించి ఉన్న ఆమె అభిమానులు ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. శ్రీదేవి మరణం ఇప్పటికి కలగానే ఉంది. ఆమె కుటుంబ సభ్యులే కాదు కొందరు అభిమానులు సైతం ఆమె జ్ఞాపకాలని తలచుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఢిల్లీకి చెందిన సబా ఆరీఫ్ అనే అభిమాని శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె చిత్రాలన్నింటిని పొందికగా పొందుపరచి ఓ వీడియో రూపొందించింది.
అయితే ఈ వీడియోని తన అనుమతి లేకుండా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) వాడేసుకుందంటూ ఇటీవల దాని నిర్వాహకులపై సబా ఆరీఫ్ఆ గ్రహం వ్యక్తం చేసింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 19వ ఐఫా అవార్డుల వేడుక జూన్ నెలలో బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది. ‘మామ్’ మూవీకిగాను జాతీయ అవార్డు గ్రహీత, దివంగత శ్రీదేవిని ‘ఐఫా’ అవార్డుల్లోనూ ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్ ఈ అవార్డు అందుకున్నారు.
ఈ వేడుకల్లో శ్రీదేవికి నివాళిగా నిర్వాహకులు ఓ వీడియోని కూడా ప్రదర్శించారు. ఆ వడియో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. మొన్న ఆదివారం ‘ఐఫా’ అవార్డుల కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవికి నివాళి అర్పిస్తూ ప్రదర్శించిన వీడియో తను రూపొందించిందే అని తెలిసి షాక్ అయిందట సబా ఆరీఫ్. తను ఎంతో ఇష్టంగా తయారు చేసిన వీడియోని ‘ఐఫా’ నిర్వాహకులు వాడేసుకున్నారంటూ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఆమె నిర్వాహకులపై మండిపడింది.
‘‘నేను కష్టపడి చేసిన దానిని మరొకరు చేసినట్టు చూపించడం బాధగా ఉంది. టీవీలో వస్తున్న సమయంలో నా వీడియో చూసి షాక్ అయ్యాను. శ్రీదేవిపై ఎంతో అభిమానంతో రూపొందించిన ఈ వీడియోని నా అనుమతి లేకుండా వారు ఎలా ప్రదర్శిస్తారు. కనీసం నా పేరు కూడా ఎక్కడ వేయలేదు. శ్రీదేవికి నివాళులు తెలియజేస్తూ నేను రూపొందించిన వీడియోని ప్రసారం చేసినందుకు సంతోషించాలో, నా అనుమతి లేకుండా వీడియోని వాడుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మీరు ఎంత బద్ధకస్తులో, శ్రీదేవికి ఎంత ఘనంగా నివాళులు అర్పించారో దీనిని బట్టి అర్దమవుతుంది..’’ అంటూ సదా తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.