‘గుడ్ ఫ్రైడే’ ప్రాముఖ్యత ఏమిటి? ఏసు మరణించిన రోజును ఇలా ఎందుకు పిలుస్తారు?

good-friday-jesus-christ-crusification
- Advertisement -

ఆయన దైవ కుమారుడు. సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం పరిశుద్ధాత్మ ప్రభావంతో ఓ కన్యక గర్భమందు ప్రవేశపెట్టబడి ఈ భూమ్మీదికి అరుదెంచారు. ఈ లోకంలో బతికున్నంతకాలం తన తండ్రి ఏ పనిపై పంపించారో ఆ పనిని పూర్తి చేయడానికే శ్రమించారు. తనను అనుసరించిన వారికే కాదు, సమస్త లోకానికి ప్రేమను పంచమని బోధించారు.

చివరికి ఆయన ఈ లోకం విడిచి వెళ్లాల్సి వచ్చిన రోజున తన దేహాన్ని శిలువకు అప్పగించుకున్నారు. అప్పుడు కూడా ‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి..’ అనే వేడుకున్నారు. మరి అలాంటి ఏసుక్రీస్తు మరణించిన రోజును గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం) అని ఎందుకు పిలుచుకుంటున్నాం? అసలు గుడ్ ఫ్రైడేకి ఉన్న విశిష్టత ఏమిటి?

గుడ్ ఫ్రైడే అంటే …

గుడ్ ఫ్రైడే అంటే … శుభ శుక్రవారం. అయితే చాలామందికి ఇది బాధాకరమైన రోజని తెలియదు. కొంతమంది ఈ రోజును ఏదో పండగలా భావిస్తారు. కారణం గుడ్ ఫ్రైడే‌ అనే పదంలో ‘గుడ్’ ఉండటమే. గుడ్ అంటే శుభం. కానీ ఇక్కడ మాత్రం అర్థం వేరు. ఈ గుడ్ ఫ్రైడేను .. బ్లాక్ ఫ్రైడేగా కూడా పిలుస్తారు.

బైబిల్ ప్రకారం.. సమస్త మానవాళి పాప ప్రక్షాళన కోసం ఏసుక్రీస్తు సిలువపై తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. ఏసును సిలువపై వేలాడదీసిన రోజు శుక్రవారం. అందుకే ఆ రోజును క్రైస్తవులు పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు.

పవిత్రమైన దినం…

క్రైస్తవులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన దినం. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి రోజంతా ఏసుక్రీస్తును, వారి కోసం ఆయన తన ప్రాణాలను శిలువకు అప్పగించుకోవడాన్ని తలచుకుంటారు. రోజులో అధికభాగం ప్రార్థనలో గడుపుతారు. ఈ గుడ్ ఫ్రైడే క్రైస్తవులు ఉపవాసం ఉండే లెంట్ దినాలలోనే వస్తుంది.

క్రిస్మస్ తర్వాత క్రైస్తవులు క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఇవి ‘ఈస్ట్ వెడ్నెస్‌డే’ నుంచి ప్రారంభమై ‘గుడ్‌ ఫ్రైడే’ రోజున ముగుస్తాయి. ఈ లెంట్ దినాలలో క్రైస్తవులు మాంసాహారం భుజించరు. గుడ్ ఫ్రైడే రోజున ఒకపూట పూర్తి స్థాయి భోజనం చేసి, మరో రెండు పూట్ల ఫలహారం తీసుకుంటారు.

కేవలం 33 వెండి నాణేల కోసం…

ఏసుక్రీస్తును ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యూదాయే నాటి రోమన్ సైన్యానికి అప్పగిస్తాడు. కేవలం 33 వెండి నాణేల కోసం ఆశపడి ఆయన ఉన్న చోటును వారికి చూపించడమేకాక, ఆయన్ని వారు గుర్తించేలా ప్రవర్తిస్తాడు. దీంతో వారు ఏసుక్రీస్తును తమ ఆధీనంలోకి తీసుకుని, తమ పై అధికారుల వద్దకు తీసుకెళ్లగా, వారు ఆయనపై విచారణ జరిపి చివరికి శిలువపై వేలాడదీయమంటూ శిక్ష విధిస్తారు.

ఆ తరువాత ఏసును హేళన చేస్తూ, ఆయనపై పిడిగుద్దులు కురిపిస్తూ.. ఆయనపై ఉమ్మివేస్తూ కొందరు ఆనందిస్తారు. అది చాలదన్నట్లు కొరడాలతో కొట్టి, తలపై ముళ్లకిరీటం తగిలించి హింసిస్తారు. బరువైన శిలువను ఆయనచేతే మోయిస్తారు. అలా ఆయన్ని హింసిస్తూ.. కల్వరి అనే కొండపైకి తీసుకెళ్లి అక్కడ అదే శిలువపై కాళ్లు, చేతులకు మేకులు కొట్టి వేలాడదీస్తారు.

శిలువపై పలికిన ఏడు మాటలను…

గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి, ఏసును హింసించిన విధానాన్ని, శిలువపై ఉన్న సమయంలో ఆయన పలికిన ఏడు మాటలను గుర్తు చేసుకుంటారు. అయితే గుడ్ ఫ్రైడే రోజున శిలువపై మరణించిన ఏసుక్రీస్తు తిరిగి మూడో రోజైన ఆదివారం పునరుత్తానం చెందారని క్రైస్తవులు నమ్ముతారు. అందుకే ఆయన తిరిగి శరీరంతో సహా లేచిన రోజైన ఆదివారంను ‘ఈస్టర్‌’గా పిలుచుకుని పండుగ చేసుకుంటారు.

ఏసుక్రీస్తు తాను భూమిపై బతికున్న రోజుల్లో పొరుగువారిని ప్రేమించాలని, తప్పు చేసిన వారిని క్షమించాలనే బోధించారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి ఏసుక్రీస్తు జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం. కాబట్టి క్రైస్తవులు వారి జీవితాల్లో ఏసుక్రీస్తు చూపిన ఈ మార్గాన్నే అనుసరిస్తారు.

- Advertisement -