33.1 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home క్రికెట్ విండీస్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన పాక్!

విండీస్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన పాక్!

gyel
- Advertisement -

ఇంగ్లాండ్: వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ అద్భుత విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 3 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించారు. విండీస్ బౌలర్లు పాక్‌ను 21.4 ఓవర్లలో ఆలౌట్ చేస్తే… బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే చేధించడం మొత్తంగా 35.2 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ముగిసింది.

విండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్‌గేల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, నికోలస్ పూరన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్ష్యం మరీ చిన్నది కావడంతో విండీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు.

4.3 ఓవర్లలోనే 36 పరుగులు రాబట్టారు. ఈ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించిన షాయ్ హోప్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో డకౌట్ కాగా… 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్రిస్‌గేల్… తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, హెట్మయర్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు.

నికోలస్ పూరన్ 34 పరుగులు చేయగా, హెట్మయర్ 7 పరుగులు చేశాడు. విండీస్ కోల్పోయిన 3 వికెట్లు మహ్మద్ అమీర్‌కే దక్కడం విశేషం. 11 జనవరి 2019 నుంచి పాకిస్థాన్ జట్టు ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఆఫ్ఘనిస్థాన్ చేతిలో పాక్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. నాలుగు వికెట్లు తీసి, పాక్ పతనంలో కీలక పాత్ర పోషించిన ఒసానే థామస్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

- Advertisement -