తప్పుచేశాడు, తప్పలేదు: రోహిత్ శర్మకు ముంబై ప్రాంఛైజీ వెరైటీ శిక్ష

- Advertisement -

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు క్రమశిక్షణతో మెలగకపోతే కాస్త వెరైటీ శిక్ష విధించాన్ని మనం అంతకముందు చూశాం. షెడ్యూల్ ప్రకారం జిమ్ సెషన్స్‌కు హాజరుకాక పోవడంతో కొద్ది రోజుల క్రితం ముంబై ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, అంకుల్‌ రాయ్‌, రాహుల్‌ చాహార్‌‌లు ఎమోజీలు ఉన్న సూట్ వేసుకుని విమానాశ్రయంలో కనిపించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ వెరైటీ శిక్షను ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు విధించారు. ఎమోజీ డ్రెస్ వేసుకున్న రోహిత్‌ శర్మ ఫొటోలను ఆయన భార్య రితికాతో పాటు ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. జిమ్‌ సెషన్‌‌కు రాకపోయినా, కిట్‌ బ్యాగ్‌ మరిచిపోయినా, డ్రెస్‌ కోడ్‌ నిబంధన ఉల్లంఘించినా ఫ్రాంఛైజీ యాజమాన్యం ఆదేశాల మేరకు ఈ ఎమోజీ డ్రెస్ వేసుకోవాల్సిందే.

పైన పేర్కొన్న వాటిల్లో రోహిత్ శర్మ ఏ నిబంధనను ఉల్లంఘించాడో తెలియరాలేదు. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ జట్టు గురువారం ఢిల్లీకి బయల్దేరింది. ఈ సమయంలో రోహిత్‌ శర్మ ఎమోజీ బొమ్మలతో కూడిన డ్రెస్‌ను ధరించడంతో జట్టులోని మిగతా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు అతడిని ఆట పట్టించారు.

కాగా, టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై… ఢిల్లీపై భారీ విజయంతో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది.

- Advertisement -