ఇంజనీరింగ్‌ సిలబస్‌లో మార్పులు.. కార్యాచరణ రూపొందిస్తున్న జేఎన్‌టీయూ

- Advertisement -

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ సిలబస్‌లో భారీగా మార్పులు రానున్నాయి. 2018-19 విద్యా సంవత్సరం నుంచి నూతన సిలబస్‌ను దశల వారీగా అమలు చేసేందుకు జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ సిలబస్‌లో మార్పు చేయాలని ఏఐసీటీఈ అన్ని సాంకేతిక యూనివర్సిటీలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన జేఎన్‌టీయూ కార్యాచరణ ప్రారంభించింది.

ఇందులో భాగంగా 2018-19 విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరం సిలబస్‌లో మార్పులు చేయనుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది దశలవారీగా మిగతా సంవత్సరాల సిలబస్‌లో మార్పులు చేయనుంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ దాదాపు పూర్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా థియరీతో పోలిస్తే ప్రాక్టికల్స్‌ ఎక్కువగా ఉండేలా నూతన సిలబ్‌సను రూపొందించనున్నారు. కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానం చేసే విధంగా సిలబస్‌ ఉండనుంది.

త్వరలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఆగస్టులో తరగతులూ ప్రారంభం కానున్నాయి. కానీ, ఇప్పటివరకు నూతన సిలబస్‌పై జేఎన్‌టీయూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అనుబంధ కాలేజీలకూ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం తెలిపింది. నూతన సిలబస్‌ ప్రతి విషయంపై అవగాహన ఉండేలా ఉండబోతుందని ఓ ప్రొఫెసర్‌ తెలిపారు.

- Advertisement -