34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రికెట్ విరాట్ కోహ్లీ మారిపోయాడా? వైరల్ అవుతున్న ఫొటో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు…

విరాట్ కోహ్లీ మారిపోయాడా? వైరల్ అవుతున్న ఫొటో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు…

- Advertisement -

ఆంటిగ్వా: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతడి దుందుడుకు స్వభావంపై అప్పట్లో బోల్డన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే, అతడు సాధించే విజయాల ముందు అవన్నీ కొట్టుకుపోయాయి.  ఆ తర్వాత అతడిపై విమర్శలకు మరో కారణం దొరికింది.

అనిల్ కుంబ్లే వ్యవహారంలో కోహ్లీ వ్యవహరించి తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీ అహంకారపూరితంగా వ్యవహరించడంతో టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశాడు.

కుంబ్లే లాంటి వాడు రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించాడంటే కోహ్లీ ఎంత అహంభావంతో ప్రవర్తించి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చంటూ అతడిపై ముప్పేట దాడి మొదలైంది. అయినా అవేమీ పట్టించుకోని విరాట్ కోహ్లీ తనకిష్టమైన రవిశాస్త్రిని కోచ్‌గా నియమించుకుని మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నాడు.

పరివర్తన కలిగిందా?

అయితే, తాజాగా కోహ్లీ ఓ పుస్తకం చదువుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు అంటిగ్వాలో వెస్ట్ ఇండీస్‌తో తొలి టెస్టు ఆడుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా శుక్రవారం డ్రెస్సింగ్ రూములో కోహ్లీ ‘డిటాక్స్ యువర్ ఇగో: 7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడమ్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్’ (అహాన్ని పారదోలండి: జీవితంలో స్వేచ్ఛ, సంతోషం, విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఏడు మార్గాలు) అనే పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తనలోని అహాన్ని తగ్గించుకోవాలంటే ఈ పుస్తకం చదవాలని ఎవరో సలహా ఇచ్చి ఉంటారని, బహుశా అందుకే అతడు చదువుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ ఆ పుస్తకం చదవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ ఆ పుస్తకం చదవడం మాత్రం సంతోషించదగ్గ పరిణామమని అతడి వ్యవహార శైలి గురించి బాగా తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

- Advertisement -