25 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ రాజమౌళి – మహేశ్ మూవీ ‘వారణాసి’ నుంచి బిగ్ అప్‌డేట్

రాజమౌళి – మహేశ్ మూవీ ‘వారణాసి’ నుంచి బిగ్ అప్‌డేట్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అత్యంత భారీ బడ్జెట్‌తో టైమ్ ట్రావెల్, యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి అభిమానులను ఉర్రూతలూగించే సంచలన విషయాలను ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించారు.

80 శాతం షూటింగ్ పూర్తి!
సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ సాగుతుందనే టాక్ ఉంది. కానీ ఈసారి ‘జక్కన్న’ రాకెట్ వేగంతో పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని, కేవలం 20 శాతం చిన్న చిన్న సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. “2022 నుంచి దాదాపు నాలుగేళ్లకు పైగా ఈ కథపై వర్క్ చేశాం. కీలకమైన యాక్షన్ సీక్వెన్సెస్, మేజర్ షెడ్యూల్స్ అన్ని పూర్తయ్యాయి” అని తెలిపారు.

వారణాసి టు అంటార్కిటికా.. అక్కడి నుంచి రామాయణ కాలానికి!
సినిమా కథా నేపథ్యం గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథ పురాతన నగరమైన వారణాసిలో ప్రారంభమై.. మంచు ఖండమైన అంటార్కిటికా, ఆఫ్రికా అడవుల మీదుగా ప్రయాణించి ప్రసిద్ధ రామాయణ కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్తుందని తెలిపారు. హాలీవుడ్ క్లాసిక్ ‘ఇండియానా జోన్స్’ తరహాలో సాహసాలు, వినోదం మేళవించి ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు చెప్పారు.

నోలన్ స్టైల్లో ఐమ్యాక్స్ మ్యాజిక్‌
ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మార్చేందుకు ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల భారీ మంచు కొండలు, రామాయణ ఘట్టంలోని విరాట్ వానర సేనను ఐమ్యాక్స్ కెమెరాలతో అత్యంత విశాలంగా, అద్భుతంగా చూపించబోతున్నారు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మేకింగ్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ప్రభావం తనపై ఉందనే విషయాన్ని జక్కన్న సంతోషంగా అంగీకరించారు.

అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు
ఒకవైపు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు హాలీవుడ్‌కు చెందిన టాప్ వీఎఫ్‌ఎక్స్ సంస్థ‌లు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

తెలుగు సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ పీఠంపై నిలబెట్టేందుకు రాజమౌళి-మహేశ్ జోడీ సిద్ధమవుతుండటంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

- Advertisement -