
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తానెప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తానని మాత్రమే చెప్పానని పవన్ గుర్తు చేశారు.
రాజధానికి 33వేల ఎకరాలు అవసరమా? అని మాత్రమే నాడు ప్రశ్నించానని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించాను తప్పితే అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అప్పట్లో అమరావతి నిర్మాణానికి నేతలు, ప్రజలు మద్దతు తెలిపిన విషయాన్ని ఈసందర్భంగా పవన్ గుర్తు చేశారు.
ఇప్పుడు ఏర్పాటు చేస్తామన్న రాజధానికి కూడా అందరి మద్దతు ఉండాలని పవన్ అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజల్లో అయోమయం నింపుతున్నాయన్నారు. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని చెబుతూ కాలాయపన చేయడం మాని కేసులు పెట్టాలని పవన్ సూచించారు.








