
హైదరాబాద్: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. అన్ని ప్రధాన పార్టీల నాయకులు అధికారం కోసం ప్రచారంలో తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఈ ఏడాదే టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
చిత్ర పరిశ్రమలో ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఆదివారం జరగనున్నఎన్నికల్లో ‘శివాజీరాజా ప్యానెల్ వర్సెస్ నరేశ్ ప్యానెల్’ మధ్య పోటీ యుద్దాన్ని తలపించేలా ఉంది. ఇప్పటికే ఈ రెండు వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు.
నరేశ్ ప్యానెల్‌పై మండిపడ్డ శివాజా రాజా…
ఇదిలా ఉండగా.. నరేశ్ ప్యానెల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని శివాజా రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ‘మా’కి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా పోటీ పడుతున్నారు.
నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. శివాజీరాజాకు శ్రీకాంత్, కమెడియన్ పృథ్వీ, నటుడు నాగినీడు లాంటి వాళ్లంతా మద్దత్తునిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీరాజా ప్యానల్ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించగా, నరేష్‌పై ఇందులో శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈసారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే అనుకున్నా. కానీ మా ప్యానల్‌లోని సభ్యులు అంతా పట్టు బట్టి మరీ అడగడంతో కాదనలేక పోయాను. వీరే కాకుండా పద్మ అనే మహిళ నేను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాననీ, ‘మా’ పింఛన్ తీసుకోనని కూడా చెప్పారు. వీరందరి ప్రేమ నన్ను పోటీ చేసేలా చేసింది. ఇదే చివరిసారి, మళ్లీ పోటీ చేయను.. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది..’’ అని వెల్లడించారు.








