

హామిల్టన్: వరుసగా మూడు వన్డేలను వరుసగా గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. నాలుగో వన్డేలో ఘోర పరాజయం పాలైంది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. మరోవైపు 200వన్డే ఆడుతున్న రోహిత్ శర్మకు ఈ వన్డే చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇటు బ్యాట్స్‌మెన్, అటు బౌలర్లు రాణించడంతో నాలుగో వన్డేలో కివీస్ జట్టు అలవోకగా విజయం సాధించింది.
గురువారం హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అలవోకగా సాధించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.4 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించింది. టీమిండియాపై కివీస్ జట్టు 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో క్లీన్ స్వీప్ నుంచి కివీస్ తప్పించుకుంది.
ధోనీ, కోహ్లీ దూరం: చరిత్రలో అత్యల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గైర్హాజరులో న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తలపడిన టీమిండియా పేలవమైన ఆటతీరును కనబరిచింది. టీమిండియా చరిత్రలోనే అత్యల్పంగా 92 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 20 పరుగుల మార్క్ ను దాటకపోవడం గమనార్హం. ఇద్దరు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్‌కు చేరారు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభమన్ గిల్ 9, అంబటి రాయుడు 0, దినేష్ కార్తీక్ 0, కేదార్ జాదవ్ 1, హార్దిక్ పాండ్యా 16, భువనేశ్వర్ కుమార్ 1, కులదీప్ 15, ఖలీల్ 5 పరుగులు చేయగా, చాహాల్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 92 పరుగులకే టీమిండియా ఆలౌటైంది.
కాగా, న్యూజిలాండ్ బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పరుగులేమీ ఇవ్వకుండా.. వరుస వికెట్లు తీస్తూ హడలెత్తించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 5 వికెట్లు దక్కగా, గ్రాండ్ హోమ్ కు 3, ఆస్ట్లే, నీషామ్‌లకు చెరో వికెట్ దక్కాయి. స్వల్ప లక్ష్యమే కావడంతో న్యూజిలాండ్ విజయం ఖాయంగా తెలుస్తోంది.








