రాజీనామా చేస్తా: కాంగ్రెస్ అధిష్ఠానానికి రేణుకా చౌదరి అల్టిమేటం, ఎందుకంటే…?

renuka-chowdary
- Advertisement -

renuka-chowdhury

హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి హెచ్చరించారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పారు.

ఖమ్మం పార్లమెంట్‌ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో మనస్తాపం చెందిన రేణుక.. ఈసారి టికెట్‌ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని కార్యకర్తలు కూడా రేణుకా చౌదరిపై తీవ్ర ఒత్తిడి తేవడం గమనార్హం.

ఖమ్మం జిల్లాలో అనుకూల ఫలితాలు రావడంతో..

కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి ఇటీవలి డీసీసీ అధ్యక్షులు నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని రేణుకాచౌదరి నివాసంలో జరిగిన సమావేశానికి ఖమ్మం కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు.

కాగా ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న మేరకు స్థానాలు దక్కడంతో ఎలాగైనా ఖమ్మం ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గెలిచే సత్తా ఉన్న నేతలను బరిలో దించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణుకా చౌదరి పార్టీకి రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది.

చదవండి: కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు: ఎందుకంటే..?, సీఎం పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం!

- Advertisement -