

ఏపీలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
పోయినవారి గురించి నేను ఆలోచించను…
24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు పోయే పరిస్థితికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా’ అని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా’ అని చంద్రబాబు అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.








