తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018: ఎత్తులు, పై ఎత్తులతో.. వేడెక్కిన తెలంగాణ రాజకీయం

kcr-mahakutami-leaders
- Advertisement -

kcr-mahakutami-leaders

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మొదట వ్యూహాత్మక వైఖరితోనే అడుగులు వేశారు. అయితే ఆ తరువాత కొద్దిరోజులకి అనూహ్య  రాజకీయ పరిణామం ఒకటి చోటుచేసుకుంది. టీఆర్ఎస్  ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి ‘మహాకూటమి’గా  అవతరించాయి. అందులో ఎవరికి మింగుడు పడని విషయం ఒకటి దాగి ఉంది.

అదేమిటంటే.. తెలంగాణలో ఖాళీ అయిపోయిందని అందరూ అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించడమే. ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక్కటవడం అనే విషయాన్ని పక్కన పెడితే.. మళ్లీ ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ మహాకూటమి వెనకుండి నడిపిస్తున్నాడనే వార్తలు  ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

మరోవైపు చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడకు కేసీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆంధ్రా వాళ్లకి.. తెలంగాణలో పనేమిటి.. అడిగితే నాలుగు సీట్లు నేనే పడేస్తా కదా.. ఆ మహానుభావుడి వల్లనే కదా.. తెలంగాణ రాష్ట్రం ఇన్నాళ్లూ వెనుకబడి పోయింది.. అంటూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి వదిలారు.

దీంతో కంగుతిన్న మహాకూటమి.. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్‌నే ప్రధానాస్త్రంగా వాడుతున్నారని అర్థమై.. మరింత చాకచక్యంగా వ్యవహరించారు. తెలంగాణ రాజకీయ చదరంగంలోకి ఈసారి తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్‌ని ( ఈయనకు డిప్యూటీ సీం పదవి అంటున్నారు) తీసుకొచ్చారు. అంతేకాదు.. మహాకూటమి అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించి.. చంద్రబాబుని సైడ్ ట్రాక్‌లో పెట్టినట్టు చూపించారు.

ఎత్తులు పైఎత్తులు, రాజకీయ వ్యూహాలు…

ఇలా ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకొని ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఈ ఎన్నికల రాజకీయ చదరంగంలో మరో పావును కేసీఆర్ ముందుకు జరపాల్సి వచ్చింది.   మహాకూటమి ఒక కాలకూట విషమని ప్రకటించారు. అంతే కాదు.. ఇప్పుడు తెలంగాణకు కావల్సింది.. సింగిల్ సీఎం పార్టీ.. ఈ మహాకూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదని కేటీఆర్ ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.  ఈ సమయంలోనే కేసీఆర్ వారిని ఊపిరి కూడా తీసుకోనీయకుండా హైదరాబాద్‌లోనే భారీ బహిరంగ సభ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ  వంతు వచ్చింది. కేసీఆర్ ఎత్తులకు.. తగ్గట్టుగా ఆ పార్టీ నాయకులు  ఏకంగా రాహుల్ గాంధీనే ప్రచార పర్వంలోకి దించేశారు. కేసీఆర్ ఏం చేసినా.. దానిని కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి వ్యూహాత్మకంగా ఎదుర్కొంటోంది.

ఈ దశలో చదరంగంలో మరొక ఎత్తుగడ మొదలైంది. అదేమిటంటే.. కాంగ్రెస్‌లో సీట్ల పంపిణీకి మళ్లీ న్యూట్రల్‌గా ఉండి వివాదరహితునిగా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి జానారెడ్డిని తెరపైకి తీసుకువచ్ఛారు.  దీంతో కేసీఆర్ మళ్లీ తన ‘మాటల మంత్రం’పైనే ఆధారపడ్డారు. ముందు మహాకూటమిని  సీట్లు సర్దుబాటు చేసుకొని రమ్మనండి.. ఈ ఎలక్షన్ ముచ్చట అప్పుడు చూడొచ్చు.. అని ఒక స్టేట్‌మెంట్ పడేశారు.

బహుశా ఈ బాధలు పడలేకే అనుకుంటా.. ముందుగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా సీట్ల పంపిణీ చేసేసి ఆ తరువాత ప్రచారం ప్రారంభించారు.  మరోవైపు మహాకూటమిలోని పార్టీల సీట్ల పంపిణీ పూర్తి కాకపోవడం, ఎవరికిస్తారో తెలియకపోవడంతో ఉత్సాహం ఉన్నా.. బడా నాయకులు సైతం వెనుకడుగు వేస్తున్నారు. సీటుపై నమ్మకం ఉన్న నల్లొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు మాత్రం ప్రచారం మొదలుపెట్టేశారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పాత్ర ఏమిటో…

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారా? అంటే.. అందుకు అవును అనే మాట రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం సైతం చంద్రబాబు ఆలోచనలపై నమ్మకం ఉంచుతోందని ఒక టాక్. కారణం – గతంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశానికి తెలంగాణ కంచుకోటలా ఉండేది.

ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని  చంద్రబాబు ఆలోచనలను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం గౌరవిస్తోంది. అంతేకాదు, చంద్రబాబు సలహాలు.. సూచనలను విస్మరించవద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఆ పార్టీ సూచించినట్లు భోగట్టా. కొందరు టీ-కాంగ్రెస్  నేతల ద్వారా  గులాం నబీ ఆజాద్ లాంటి పెద్దలకు సమాచారం చేరుతోందని, అక్కడ నుంచి  రాహుల్ గాంధీకి కూడా వెళుతోందని.. దాంతో అక్కడ నుంచి ఎప్పటికప్పుడు డైరెక్షన్ వస్తోందని సమాచారం.

టీఆర్ఎస్‌లో ఇంటి పోరు…

ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే.. ఆ పార్టీ ముందుగానే సీట్లు కేటాయించడం ద్వారా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులు రేకెత్తించగలిగింది. ప్రచారానికి సరిపడా సమయం కూడా దొరికిందిగానీ.. మరో ప్రమాదం వచ్చిపడింది.  ఇతర పార్టీల నుంచి వలసల వల్ల కాని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పని చేసిన వారుగానీ.. ఇలాంటి వారితో టీఆర్ఎస్ కారు ఫుల్లుగా నిండిపోయింది. ఇవన్నీ గమనించిన కేసీఆర్ ముందుగానే కొన్ని టిక్కెట్లతో కారుని లాగించేశారు.

దీంతో టీఆర్ఎస్‌లో ఇంటి పోరు మొదలైంది.  తామూ కారెక్కుతామంటూ ఇప్పుడు మరికొందరు నేతలు ఆ కారు వెనుక పరుగెడుతున్నారు. వారిని ఎంత సముదాయిస్తున్నా ఫలితం ఉండటం లేదు.  కొన్ని స్థానాల్లో అసంతృప్తులు చల్లారడం లేదు.  చెన్నూరులో కొద్దిగా సద్దుమణిగినా.. మహబూబాబాద్ కల్వకుర్తి, మానుకోట, డోర్నకల్ లాంటి చోట్ల అసమ్మతి జ్వాలలు ఇంకా రగులుతునే ఉన్నాయి.

కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ జైపాల్ యాదవ్‌కు టికెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకూ ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి నారాయణరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై  సహాయనిరాకరణ మొదలు పెట్టారు.

కేసీఆర్ మదిలో ఏముందో..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇంటిపోరును పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా తెలంగాణలో ఇంటింటికి తన సందేశం వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా లేదా పోస్ట్ కార్డు ఇలా ఏ మార్గంలో అనువుగా ఉంటే అలా.. తన ఉద్దేశం, సందేశం వినిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.  అసంతృప్తి వాదులను కొంత మేర బుజ్జగిస్తున్నారు.

మరోవైపు ఇంకా ఎవరికీ కేటాయించని 15 సీట్లపై కూడా ప్రతిష్టంభన మొదలైంది. ఇందులో కొన్ని ఎంఐఎంకి కేటాయిస్తారు. మిగిలినవి బీజేపీకి ఇస్తారా? అనేది అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఎందుకంటే బీజేపీ అని పైకి చెబితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగి.. అది మళ్లీ తన పార్టీపైనే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనే మీమాంశలో.. తెలంగాణ పితామహుడు కేసీఆర్ ఎటువంటి వ్యూహం అనుసరిస్తారు అనే దానిపై  ఎన్నికల సమీకరణాలు, ఫలితాలు మారే అవకాశాలున్నాయి.

మహాకూటమి సంగతేమిటి?

ఒకవైపు న్నికలు  సమీపిస్తున్నాయి. గట్టిగా మాట్లాడితే 40 రోజుల వ్యవధి కూడా లేదు. ఇంకా సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో  ‘మహాకూటమి’లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. నాయకులందరూ తలలు పట్టుకుంటున్నారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక సమయమంతా చర్చలపైనే గడిపేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే మహాకూటమి నేతలంతా రహస్యంగా గండిపేటలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు.  టీడీపీ నాయకుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఓ ముఖ్య నేత.. ఈ సమావేశానికి హాజరైనట్లు  సమాచారం. సీట్ల పంపకం ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో ముందడుగు వేయాలని అందరూ తీర్మానించారు.

తేలని లెక్కలు…

టీడీపీ 15 సీట్లు అడుగుతోంది.  అయితే కాంగ్రెస్ 8 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు  సిద్ధపడుతోంది.   సీపీఐ కోరుతున్న ఆరు సీట్లలో మూడు మాత్రమే ఇస్తామని అంటోంది. కోదండరాం అడుగుతున్న 16 సీట్లలో 8 మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ వెల్లడించడంతో సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలలో ప్రతిష్టంభన నెలకొంది.  వీలైనంత త్వరగా మళ్లీ మరో సిట్టింగ్ పెట్టుకుని.. వీలైనంత త్వరగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని మహాకూటమి నాయకులందరూ ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.

బీజేపీ పరిస్థితి.. ఏమిటి?

కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పటికీ.. బీజేపీ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో అగమ్యగోచరంగా ఉంది. ఒకప్పుడు తెలంగాణాలో ఆ పార్టీకి కాస్తో కూస్తో బలం ఉండేది.  ప్రస్తుతం చూస్తుంటే.. వెంటిలేటర్ కూడా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ‘మహాకూటమి’గా జట్టు కట్టడంతో.. ఇటు వైపు ఎవరున్నారా అని చూస్తే.. ఆ పార్టీ నాయకులకు కేసీఆర్ కనిపిస్తున్నారు.  వెళితే కేసీఆర్‌తో వెళ్లాలి. కానీ మరో వైపు టీఆర్ఎస్.. ఎంఐఎంతో దోస్తీ చేస్తోంది.

సరిగ్గా ఇక్కడే బీజేపీ ఇరుకున పడిపోతోంది.  సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా టీఆర్ఎస్‌తో కలిసి ప్రయాణించడం బీజేపీకి కుదరని పని అని టీఆర్ఎస్‌ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొంటున్నారు. దీంతో బీజేపీ తరుపున రేసులో ఆ పార్టీ  అధ్యక్షుడు లక్మణ్, అటు దత్తాత్రేయ, ఇటు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు లాంటి వాళ్లున్నా.. చివరికి వచ్చేసరికి వీళ్లలో ఎంతమంది రేస్‌లో ముందుంటారనేది ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేగాని  తెలియదు.

అధికారం ఉన్నా లేకపోయినా ఢిల్లీ‌లోనే ఉండే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మళ్లీ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక ఎప్పటిలాగే హనుమంతరావు కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  కాంగ్రెస్ నుంచి ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు.

ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్స్…

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మంగళవారం ఉదయం ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా, కోడ్ ఉల్లంఘించిన వారు, నగదు లావాదేవీలు, మద్యం సరఫరా.. ఇలా పలు అంశాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుందని, ఆ సమయానికి తగిన ఏర్పాట్లు చేసి ఈ అంశాలపై ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలియజేయాలని వారికి సూచించారు.

– శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -