అమృత్‌సర్: శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని అమృత్‌సర్ జోడా పాఠక్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 60 మంది వరకు ప్రాణాలు కోల్పోవడానికి సెల్ఫీల పిచ్చే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న రావణ దహనం సెల్ఫీలో చిత్రీకరించేందుకు అక్కడ ఎత్తుగా ఉన్న రైలు ట్రాక్ పైకి ఎక్కినట్టుగా తెలుస్తోంది. అందరూ అటే చూడటం, సెల్ ఫోన్లో చిత్రీకరించడంపై కొందరు ఉండిపోవడం, భారీ శబ్ధాల కారణంగా రైలు ఇంజన్ శబ్ధం కూడా వినిపించ లేదు. సెల్ఫీలు తీయడంలో కూడా ప్రజలు పోటీ పడటంతో వారు రైలు రాకను గమనించ లేదు. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
చదవండి: ఘోర ప్రమాదం: జనం పైనుంచి దూసుకెళ్లిన రైలు.. 50 మంది కిపైగా మృతి
సెల్ ఫోన్ల వినియోగంపై తీవ్రమవుతున్న చర్చ
ఒక ఘోరమైన విషయం ఏమిటంటే.. ఆ ఏడుస్తున్న బంధువులను ఓదార్చడం, లేదా, మృతదేహాల వెలికితీతలో సహాయపడటం, వెంటనే అధికారులకి సమాచారం పంపడం ఇవేవీ చేయకుండా చాలామంది ముందు రైలు ఢీ కొడుతున్న దృశ్యాలను.. అప్పటికప్పుడు సెల్ ఫోన్లలో చిత్రీకరించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సెల్ ఫోన్లు మనుషులపై ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనే అంశం ఇప్పుడు తాజాగా తెరపైకి వస్తోంది. ఆ వీడియోని తీయలేకపోయిన వారు అవి తీసిన వారి నుంచి కంగారుపడిపోతూ.. హడావుడిగా అప్పటికప్పుడు తమ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందు ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూసి.. మనమెంత సెల్ ఫోన్లకి బానిసలమైపోయామని పలువురు నెటిజన్లు వాపోతున్నారు.
ఎందుకంటే ఆ రైలు ప్రమాదం తను ముందుగా పంపిస్తే.. ఆ క్రెడిట్.. మొత్తం తనకే దక్కుతుందని భావించడమేనని దీనంతటికి కారణమని కామెంట్ చేస్తున్నారు. ముందు మానవత్వం చూపించకుండా సెల్ ఫోన్ లో చిత్రీకరించడంపై దృష్టి పెట్టడాన్ని మొబైల్ ఫోన్లు వాడుతున్న అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సెల్ ఫోన్లు వాడకం వల్ల మనిషిని మనిషే గుర్తించలేని అధ్వాన స్థితికి దిగజారాడని ఈ ఒక్క సంఘటన రుజువు చేస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రోడ్డుపై చిన్న ప్రమాదం జరిగితే.. ఎంత పని జరిగిందని పదిమంది గుమిగూడే వారని ఇప్పుడదేమీ లేకుండా.. ఫోన్లుపై ఉండటాన్ని అందరూ గుర్తించి మనమెంత అథమ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇది మొబైల్ ఫోన్లు పిచ్చిగా వాడుతున్న అందరూ ఆలోచించాల్సిన విషయమని వ్యాఖ్యానిస్తున్నారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న వారికి సహయం చేయల్సింది పోయి వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం మరింత ఘోరమైన విషయం అని చెబుతున్నారు. రైలు ప్రమాదంలోభారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంపై దిగ్భ్రాంతికి లోనైనట్టు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ మాట్లాడుతూ.. ‘రైలు ప్రజలపై నుంచి వెళ్తుంటే దానిని కూడా కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించడం సిగ్గుచేట్టు’ అని విమర్శించారు.