హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కిరికిరి.. పతాకస్థాయికి చేరింది. ఆరు నూరైనా టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమికడితే.. ఆ కూటమినే ఓడించేందుకు తిరుగుబాటు అభ్యర్థులు కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అన్యాయానికి బలైపోయామంటూ 40 మంది తిరుగుబాటు అభ్యర్థులు ‘తెలంగాణ రెబల్ ఫ్రంట్’గా ఏర్పడుతున్నట్టు ప్రకటించారు.
తామంతా ఒకే గుర్తుతో పోటీ చేస్తామని చెప్పారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని కాదని బ్రోకర్లు, రౌడీషీటర్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఈ ‘రెబల్ ఫ్రంట్’కు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రులు బోడ జనార్దన్, విజయ రామారావు చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టించింది.
‘‘కాంగ్రెస్ ఓటమి ఖాయం.. ఉత్తమ్‌దే బాధ్యత…’’
అంతేకాదు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, అందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిదే బాధ్యతని కూడా వారు పేర్కొన్నారు. ఉత్తమ్ చేసిన పనితో.. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం
వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. అలాగే కూటమిలో టికెట్లు ఆశించి భంగపడిన వారు సొంతపార్టీ అభ్యర్థి అయినా, మిత్రపక్ష అభ్యర్థి అయినా ఓడించడమే లక్ష్యమని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు ఎలా వదిలేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ నియోజకవర్గ సీపీఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కుర్చీలు విరగ్గొట్టారు. ఇక కూకట్‌పల్లిలో టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ స్థానిక నాయకత్వం.. ఆమెను చిత్తు చిత్తుగా ఓడించి తీరుతామని శపథం చేసింది.
‘‘సమరభేరి మోగించాల్సిన తరుణంలో…’’
కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీజేఎస్ సైతం కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌ను నమ్ముకోవడం వల్ల జరుగకూడని నష్టం జరిగిందని సాక్షాత్తు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించడం గమనార్హం. సమరభేరి మోగించాల్సిన తరుణంలో టికెట్లపైనే కసరత్తు చేయాల్సిరావడం దురదృష్టకరమని ఆయన వాపోయారు.
మరోవైపు అటు మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న టీడీపీలోనూ తిరుగుబాట్లు సెగలు రేపుతున్నాయి. కూటమి పేరుతో ఎవరికో టికెట్లు ఇస్తే తామేం కావాలని టిక్కెట్లు ఆశించి రాని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వారు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వెరసి.. తమనుతామే ఓడించుకునే దిశగా కూటమి సాగుతోందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీలోనూ తిరుగుబాట్ల ముసలం పుట్టింది. మూడో జాబితాలోనూ టికెట్ దక్కకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.