ఆయన ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో ఎవరికి తెలీదు. హఠాత్తుగా ప్రత్యక్షమవుతారు.. అంతలోనే మళ్లీ కనిపించకుండా పోతారు. మళ్లీ ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ వస్తోరో ఎవరికీ అర్థం కాని విషయం. ఆయన పేరుకు తగినట్టుగానే ఆ సూర్య ‘కిరణాలు’ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రసరిస్తాయో తెలీదు.. ‘ఎక్కడివాడో..అంతు చిక్కనివాడే కాదు..అంతు దొరకని వాడు కూడా’.. అని అందరూ అనుకునే ఆ పెద్ద మనిషి ఎవరనే కదా.. మీ సందేహం. అదేనండి.. ఆయనే.. మన..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ విభజనలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. అధిష్ఠానం తీసుకునే విభజన చర్యలను బహిరంగంగా విమర్శించి.. తను విమర్శల పాలవడమే కాదు.. మొత్తం ప్రజలందరినీ ఒక కన్ ఫ్యూజన్ లోకి నెట్టేసి.. వారిలో ఆగ్రహాలను రెచ్చగొట్టి వదిలేశారు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. ఆ స్పెషల్ స్టేటస్.. కోసమో లేదా హైదరాబాద్ కోసమో పోరాడకుండా.. అసలు తెలంగాణ రాష్ట్రమే ఇవ్వకూడదనే కాన్సెప్ట్ లోకి ఆయన జనాన్నితీసుకుపోయారు.
ఒక దశలో నాటి ఎంపీలు, మంత్రులైన పురంధరేశ్వరి, చిరంజీవిలు.. జరిగిందేదో జరిగిపోయింది.. మన డిమాండ్లు చెబితే అవి తెచ్చుకోవచ్చు అని చెబితే వారిమీద పులి పడిపోయారు. అంతే ఆ తరువాత ఎవరూ నోరు మెదపలేదు. ఇక కావూరి సాంబశివరావులాంటి వాళ్లు సందట్లో సడేమియాలా.. ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ హఠాత్తుగా కేంద్ర మంత్రి పదవులు రాగానే గప్ చుప్ అయిపోయారు. ఇలా ఎవరికివారు ఆ రోజున ఉద్యమం సంగతి పక్కన పెట్టి.. సమయానుకూలంగా సర్దుకున్నారు.
ఇలాంటి అతి క్లిష్టమైన సమయంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పాసవకుండా అటూ ఇటూ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ కాసేపు డ్రామా ఆడి.. చివరకు మమ అనిపించారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే పార్లమెంటులో బిల్లు ముందుకెళ్లిపోయింది. ఆనాడు టోటల్‌గా కన్ ఫ్యూజ్ చేసి.. విభజన పూర్తయిన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సొంత పార్టీ పెట్టి.. కనీసం దానిని కూడా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లకుండా.. మధ్యలో వదిలేశారు.
అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికవడం కూడా నాటకీయంగా జరిగింది. అప్పటివరకు ఆయన డార్క్ లోనే ఉన్నారు. మళ్లీ ఎక్కడివాడో వచ్చాడు.. ముఖ్యమంత్రి అయ్యారు.. అంతా అయిపోయింది.. మళ్లీ ఆయన కనిపించకుండా పోయారు.
మళ్లీ వచ్చారు, అందుకే ఈ చర్చ…
ఎవరికీ అంతుచిక్కని ఆయన మళ్లీ రావడం చర్చనీయాంశమైంది. వచ్చీరాగానే కొందరికి ఫోన్లు చేసినట్లు సమాచారం. వారిలో తెలుగు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇలాంటి ప్రముఖులు, ప్రస్తుతం భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీని వదిలి క్రియాశీల రాజకీయాల్లో లేకుండా ఉన్న కొందరికి ఫోన్లు చేశారు.
అలాగే పాతకాపులందరినీ తిరిగి సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ మళ్లీ ఏమైందో తెలియదు.. అంతుచిక్కకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ వచ్చారు. అందుకే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గురించిన ఈ ప్రస్తావన. వచ్చీ రాగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి కామెంట్లు చేశారు.
అయితే తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్‌తో ఏపీ సీఎం చంద్రబాబు కలిసి నడుస్తున్నారనే సంగతి.. అజ్నాతంలో ఉన్న ఆయనకి తెలియక.. అలా మాట్లాడేశారా? లేదంటే ఎప్పటిలాగే.. అంటే.. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను ఆంధ్రా తెలంగాణ విభజన సమయంలో వ్యతిరేకించినట్లు .. ఇప్పుడు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును ఆయన స్వాగతించలేకపోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.
-శ్రీనివాస్ మిర్తిపాటి