ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ! తెలంగాణలో ఎవరు ముందు, ఎవరు వెనుక…?

12:04 am, Fri, 16 November 18
maha-kutami-symbols

cong తెలంగాణ అసెంబ్లీకి మేళ తాళాలతో.. బయలుదేరి వెళ్లేందుకు ముహూర్తం దగ్గర పడుతోంది. అయితే ఎవరు వెళతారో, ఎవరు వెనుక వెళతారో ప్రస్తుతానికి సస్పెన్స్. చాలా పార్టీలు మొన్నటి వరకు అభ్యర్థులనే ఖరారు చేయలేదు. అయితే అభ్యర్థులను ముందే ప్రకటించి.. టీఆర్ఎస్ ప్రచారంలో ముందంజలో ఉంది. నెమ్మదిగా మహాకూటమి కూడా ప్రకటించడంతో.. అభ్యర్థులు అంతే నెమ్మదిగా బరిలో దిగుతున్నారు.

ఇప్పుడు ఇవతల ఎవరున్నారనేది.. టీఆర్ఎస్‌కి తెలిసింది. లేదంటే ఇంతవరకు గాలిలోనే ప్రచార విన్యాసాలు చేసింది. ఇప్పుడు సమీప అభ్యర్థి బలబలాలు చూసుకొని.. అతనెంత వరకు ఖర్చుచేస్తాడు? తానెంత వరకు తీయాలి?.. అనే లెక్కలు తేలిపోనున్నాయి. అంతేకాదు.. ప్రచారంలో కూడా విమర్శలు చేసుకునేందుకు నువ్వెంత? నేనెంత? నువ్వేం చేశావు? అంటే నీవేం చేశావు? ఇలా మాటల యుద్ధానికి తెర లేస్తుంది.

దీంతో ప్రజలకు ఇరువైపులా నుంచి హామీల వర్షం కురుస్తుంది. అవెంత వరకు నెరవేరుస్తారనేది ప్రజలే గుర్తించాలి. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా మారింది.

కూటమిలో తగ్గని కుమ్ములాటలు…

కొన్ని రోజులు..మహాకూటమికి మంచిరోజులు వచ్చాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే కూటమిలో మిత్ర పార్టీల సర్దుబాట్ల కారణంగా రెబెల్స్ రంగంలో దిగిపోతున్నారు. వారిని నిలువరించడం కాంగ్రెస్ వల్ల కావడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆ స్వాతంత్ర్యం ఉంది. ఇలా పార్టీ నుంచి బయటకు వెళ్లి రెబల్ గా దిగి.. గెలిచినా.. ఓడినా మళ్లీ కాంగ్రెస్ లో అతని స్థానం, స్థాయి రెండూ పదిలంగానే ఉంటాయి. ఆయేరాం..గయేరాం లు..వారే వీరు..వీరే వారు ఉంటుంటారు. అందువల్ల వెళ్లేవారికి ఇబ్బంది లేదుగానీ.. సీటు సంపాదించిన వారే ఏటికెదురీదాలి.. ఎందుకంటే ప్రతి చోట కాంగ్రెస్ కు కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. వీరి స్వయం ప్రభతో కొంత సాధించగలిగితే.. ఆ సంప్రదాయ ఓటు బ్యాంకుతో విజయ పతాక ఎగురవేయవచ్చుననేది ఒక కాన్సెప్ట్.. అందువల్ల సీటు ఎవరూ త్యాగం చేయరు..ఈ రెబెల్స్ ను ఆపకపోతే మాత్రం..విజయం అంత సులువు కాదు.

చివరి వరకు సస్పెన్స్…

ఈ అసంతృప్తులు ముందే ఊహించిన మహాకూటమి.. అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ఎందువల్లనంటే ఈ అసంతృప్తితో రగిలిపోయేవారికి అవకాశం ఇవ్వకూడదు. ముందే చెప్పి సమయం ఇస్తే..వారూ ప్రచారంలో దూసుకుపోయి..తమకు సీటు ఇవ్వలేదని భార్య, పిల్లలతో  ఫొటోలు దిగి.. ప్రచారం మొదలు పెడతారు.  ఆ అవకాశం ఇవ్వకుండా.. ఎవరైతే రెబల్ గా వెళ్లాలని అనుకుంటున్నారో వారికి కనీసం సర్దుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎన్నికల టైమ్ దగ్గరలో అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. అంతేకాకుండా వేరే పార్టీలోకి జంప్ అవడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇదంతా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహరచన..అది అంతే పక్కాగా ఉంటుంది.

మిత్ర పక్షాలకు 25 సీట్లు.. చెలరేగుతున్న అసంతృప్తి కుంపట్లు

మహాకూటమిలో మిత్రపక్షాలకు 25 సీట్లు కేటాయించారు. తెలుగుదేశానికి 14, టీజేెెఎస్ కు 8, కమ్యూనిస్టులకు 3..ఇచ్చారు. ఇప్పుడీ 25 చోట్లా అసంతృప్తి కుంపట్లు రగిలిపోతున్నాయి. వీరందరినీ సముదాయించడం సీనియర్ల వల్ల కావడం లేదు. దీంతో 25 స్థానాలను టీఆర్ ఎస్ ..ఎడ్జ్ తీసుకుంటే మాత్రం.. వారి విజయానికి ఢోకా ఉండదు. అలా కాకుండా ఈ 25 సీట్లు ఏవైతే ఉన్నాయో.. అందులో అభ్యర్థులు గానీ గెలిచే అవకాశాలు ఉంటే మాత్రం టీఆర్ ఎస్ ఆశిస్తున్నట్లు మరోసారి అధికారం  కష్టమేనని చెప్పాలి.. ఇప్పుడు ఏవైతే ఈ 25 సీట్లు కీలకం కానున్నాయి. విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ఒకవైపు నుంచి చూస్తే.. టీఆర్ఎస్‌కు అవకాశం

ఈ మహాకూటమి కుమ్ములాటలు, వారికి ప్రచారం చేసుకునే సమయం లేకపోవడం,  ఏదైతే టీఆర్ ఎస్ సభ్యులు గట్టిగా డబ్బులు ఖర్చు పెడతారనే ప్రచారం హోరెత్తిపోతుంది. చాలామంది సిట్టింగు ఎమ్మెల్యేల్లాంటివాళ్లే.. కేసీఆర్ దెబ్బకు హడలిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ప్రజల ముంగిట సభ పెట్టినప్పుడు.. తాగినోళ్లకు తాగినంత..అన్నట్టుగా మందు పోసి.. బస్సుల్లో, కార్లలో తరలించారు. ఇవన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అందువల్ల కేసీఆర్ ని నమ్మడానికి లేదని అవకాశం వస్తే.. సామ దాన భేద దండోపాయాలైనా ఉపయోగించి అధికారం తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఓటమిని అంత తేలికగా ఒప్పుకునే రకం కాదనేది.. ఆయన గురించిన తెలిసినవాళ్లు అంటుంటారు. తనకి అన్ని రకాలుగా కుడిభుజంగా ఉన్న కుమారుడు కేటీఆర్ .. కేసీఆర్ కి బలమేనని చెప్పాలి. ప్రస్తుతం మహాకూటమిలో కుమ్ములాటలు, అసంతృప్తులు టీఆర్ ఎస్ కు కలిసి వస్తే మాత్రం.. విజయం కేసీఆర్ వైపే మొగ్గు  చూపుతుంది.

– శ్రీనివాస్ మిర్తిపాటి