చిత్తూరు: పూతలపట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునీల్ ఓటు హక్కు తొలగించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు అందడం కలకలం రేపింది. విషయం తెలిసి ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల ఎంపైపల్లిలో తనకు ఓటు హక్కు ఉందని.. ఆ ఓటును తొలగించాలని ఎవరు దరఖాస్తు చేసుకున్నారో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది ఓటమి భయంతో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని సునీల్ కుమార్ మండిపడ్డారు. నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సునీల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే.. ఉద్దేశపూర్వకంగా..
బుధవారం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉద్దేశపుర్వకంగానే వైసీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలో ఫారమ్- 7 దరఖాస్తులు లక్షా పది వేలు దాటాయని వెల్లడించారు. మొన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించగా, నేడు ఎమ్మెల్యే ఓటు తొలగించేందుకు దరఖాస్తులు వచ్చాయని వాపోయారు.
చంద్రబాబు తన పచ‍్చ మీడియాతో తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఓట్లు తొలగింపు విషయంలో తన తప్పును కప్పి పుచ్చేందుకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దొంగాట ఆడుతున్నారని సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.








