విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. కోడి పందాలకు ఉపయోగించే కత్తిని వాడటంతో గాయం తీవ్రత అధికంగా ఉంది.
దుండగుడి దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరారు.
హైదరాబాద్ వెళ్లేందుకు రాగా…
294వ రోజు పాదయాత్ర ముగించుకొని గురువారం హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానంటూ ఆయన వద్దకు వచ్చాడు. వస్తూనే కోడి పందాల్లో కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో దాడి చేశాడు.
సెల్ఫీ అంటూ రిక్వెస్ట్ చేసి…
దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో విమానం కోసం ఎదురుచూస్తున్న జగన్ కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా?’’ అంటూ పలకరించాడు. జగన్ నవ్వుతూ చూస్తుండగా సెల్ఫీ దిగుతానంటూ రిక్వెస్ట్ చేసి.. ఆయన సరేనంటూ కుర్చీలోంచి లేస్తుండగానే దాడికి పాల్పడ్డాడు.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే…
ఈ దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని, లేదంటే జగన్ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేదని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కోడి పందాల్లో వాడే కత్తి చాలా పదునుగా ఉంటుందని, అది పొరపాటున వీపున తగిలింది కాబట్టి.. సరిపోయింది.. అదే పొరపాటున తగలరాని చోట తగిలుంటే.. ఏమిటి పరిస్థితి? అభిమానం ఇలా వెర్రితలలు వేయకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కత్తికి విషం పూశారేమో: రోజా అనుమానం
ఈ దాడి ఘటనలో వైఎస్ జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. అయితే ఆ కత్తికి విషం ఏమైనా పూసి ఉండవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫోన్లు చేసి.. గాయం చిన్నదేనని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.
అలాగే జగన్ మ సమాచారాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, శ్రేయోభిలాషులు, దగ్గరలో ఉన్న జగన్ సన్నిహితులు, మీడియా మిత్రులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సంఘటన జరిగిన వెంటనే అందరి ఫోన్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండటం విశేషం.
మొబైల్ ఫోన్ల రింగ్ టోన్ల శబ్దాలతో ఎయిర్ పోర్ట్ వాతావరణం హోరెత్తిపోయింది. జగన్ పై దాడా? ఏం జరిగింది? ఆయనకెలా ఉంది? గాయం తీవ్రమైనదా? నిందితుడు ఎవరు? ఎందుకు చేశాడు? అంటూ అక్కడ ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిసింది.