
హైదరాబాద్: తన బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి తాను గర్వపడుతున్నట్లు ఆయన తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఎన్ని కష్టనష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన బిడ్డ మడమ తిప్పడం లేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడంటూ ఆమె వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరిట రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చేపట్టిన ఈ పాదయాత్ర చివరి ఘట్టంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ తల్లి విజయమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు తన కొడుకు గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
అప్పుడు నా భర్త.. ఇప్పుడు కొడుకు…
ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడానికి ఒకప్పుడు తన భర్త రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయగా ఇప్పుడు తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నాడని విజయమ్మ చెప్పారు.
ఒక దశలో తన కొడుకు పాదయాత్ర నిర్వహించలేని పరిస్థితుల్లో ఆ బరువు బాధ్యతలను తన కుమార్తె షర్మిల తన భుజాలపై వేసుకుందని, ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు పాదయాత్ర చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా.. అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
పాదయాత్ర చేయడం వెనుక ఈ ముగ్గురి లక్ష్యం ఒక్కటేనని.. ప్రజా సంక్షేమం కోసమే అహర్నిశలూ పాటుపడ్డారని, తన భర్త మరణానంతరం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో ‘నా కొడుకు కాదు.. మీ కొడుకు..’ అంటూ తాను జగన్ మోహన్ రెడ్డిని ప్రజలకే అప్పగించానని, రాష్ట్ర ప్రజలు కూడా అదే రీతిలో జగన్‌ని తమ అక్కున చేర్చుకున్నారని విజయమ్మ చెప్పారు.
ఓదార్పు యాత్ర జగన్‌ని నాయకుడిగా నిలబెడితే.. పాదయాత్ర నాయకుడిగా స్థిరపరిచిందని ఆమె వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. ‘నవరత్నాలు’ ద్వారా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది ప్రజలకు జగన్ వివరించాడని ఆమె పేర్కొన్నారు.
అధికార పక్షం ఎన్నడూ పట్టించుకోలేదు…
రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా తన బిడ్డ జగన్ ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేశాడని, అధికార పార్టీ ఏనాడూ ప్రతిపక్షాన్ని పట్టించుకోలేదని, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా వారిలో కొంతమందిని నిస్సిగ్గుగా మంత్రులను కూడా చేసిందంటూ విజయమ్మ దుయ్యబట్టారు.
ప్రజలతో మమేకం అవుతూ.. వారి సమస్యలపై స్పందిస్తూ.. ఎక్కడికక్కడ భరోసా కల్పిస్తూ జగన్ ముందుకు సాగుతున్నాడని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెరవకుండా ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకం అవుతున్నాడని, దీంతో చివరిగా జగన్‌పై హత్య యత్నానికి కూడా పాల్పడ్డారని, ఆ దేవుడి దయ వల్ల తన బిడ్డ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడని ఆమె వ్యాఖ్యానించారు. తన బిడ్డపై హత్యయత్నం జరిగినప్పుడు తాను చాలా భయపడ్డానని విజయమ్మ తెలిపారు.
అదీ ఆయన సంస్కారం…
అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు తన భర్త రాజశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ని పరామర్శించారని, దాడిని ఖండిస్తూ ధర్నా కూడా చేశారని, కానీ తన బిడ్డ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగితే.. చంద్రబాబు కించిత్ బాధపడకపోగా, అదంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సంస్కారం ఎక్కడా.. చంద్రబాబు తీరు ఎక్కడ.. అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి జరిగిన గంటలోపే చంద్రబాబు డీజీపీతో మంతనాలు సాగించారని, దాడిని అందరూ ఖండిస్తే.. ఆయనపై దాడిచేస్తున్నట్లు చిత్రీకరించారంటూ విజయమ్మ గుర్తు చేశారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న తన బిడ్డపై దాడి జరిగితే.. దానిని పలువురు ‘కోడి కత్తి డ్రామా’గా వ్యాఖ్యానించారని, వారి ప్రవర్తనను వారి విజ్ఞతకే తాను వదిలేస్తున్నానని అన్నారు. ‘‘ఎప్పుడైనా మంచి మంచే. వైఎస్సార్ మంచి పనులు చేశారు కాబట్టే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది. పొత్తుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు..’’ అని విజయమ్మ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ‘‘మొన్నటి వరకు బీజేపీతో జతకట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కడుతున్నారు. చంద్రబాబుకు ఎప్పట్నించో కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుసుగానీ.. మరీ ఇంత బహిరంగంగా కలుస్తారని మేం అనుకోలేదు. జగన్ పాదయాత్ర, ప్రజా స్పందన చూసి చంద్రబాబు భయపడ్డారని, ఈసారి ఎన్నికల్లో అధికారం ఎక్కడ చేజారిపోతుందోనన్న భయంతోనే చివరికి కాంగ్రెస్‌తో కలిశారు..’’ అని ఆమె అన్నారు.








