
నర్సంపేట: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు.
ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమే..
అంతేగాక, జగన్.. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగమేనని, తమ వెంటే వస్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో మమత బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, నవీన్ పట్నాయక్ తమతో కలిసి పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. వారందరి మద్దతుతో 150 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఆ బలంతో కేంద్రాన్ని శాసించే స్థాయికి వెళ్తామని వ్యాఖ్యానించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేకు 150 నుంచి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు 100 సీట్లు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ అంటే పడనోళ్లు చాలా మంది ఉన్నారన్నారు. ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆరోపించారు. పేద ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మాటలతో ఆకట్టుకోవడమే మోడీ పని అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని అన్నారు.








