27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ 30న ప్రమాణ స్వీకారం చేస్తా.. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: వైఎస్ జగన్

30న ప్రమాణ స్వీకారం చేస్తా.. ఏడాదిలోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా: వైఎస్ జగన్

- Advertisement -

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి నేను ఉన్నా.. వారి కష్టాలన్నీ నేను విన్నా.. అందుకే ఈ మాట నేను మళ్లీ చెబుతున్నా.. మరోసారి హామీ ఇస్తున్నా అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఇంత భారీ మెజారిటీ రావడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు.

మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 151 రావడం, అలాగే రాష్ట్రంలోని ఎంపీ స్థానాలు మొత్తం గెలుచుకోవడం నిజంగానే రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యయమని అభివర్ణించారు. తొలి సంతకం ఏదో ఒక ఫైలు మీద కాదు… ‘నవరత్నాలు’ హామీలను అమలు చేస్తామని చెప్పారు.

రాష్ట్ర ప్రజలు విశ్వసనీయతకు వేసి ఓటు అని, ప్రజల విశ్వసనీయత కోల్పోతే రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఈ ఎన్నికల ద్వారా ప్రజలు చాటిచెప్పారని జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ విజయం దేవుడి దయతో, ప్రజల చల్లని దీవెనలతోనే సాధ్యమైందని.. ఈ విజయం తన మీద ఉన్న బాధ్యతలను, విశ్వాసాన్ని ఇంకా పెంచిందని చెప్పారు.

‘‘ఐదు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే…’’

ఐదు కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి మాత్రమే సీఎం అయ్యే అవకాశం ఇస్తాడని, ఇప్పుడు మీ అందరి చల్లని దీవెనలతో ఆ అవకాశం తనకు వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. గవర్నమెంట్ అంటే ఏమిటో, గొప్ప గవర్నెన్స్ ఎలా ఉంటుందో తాను చూపిస్తానని చెప్పారు.

అందరికన్నా జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీరంతా అనుకునేలా చేస్తానంటూ ఈ సందర్భంగా ఆయన రెండు చేతులు జోడించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని, వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది లోపే జగన్ ఒక మంచి ముఖ్యమంత్రి అని నిరుపించుకుంటానని మాటిస్తున్నానని ప్రకటించారు.

- Advertisement -