అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
గురువారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనచేత ప్రమాణం చేయించారు.
గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు జగన్ తన ఇంటి నుండి బయలుదేరి విజయవాడలోని ప్రమాణ స్వీకార సభాస్థలి ఉన్న ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియానికి చేరుకొన్నారు.
స్టేడియం నలువైపులా తిరిగి…
ఓపెన్ టాప్ జీప్‌లో జగన్ స్టేడియం నలువైపులా తిరిగి.. రెండు చేతులు జోడించి తన ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ప్రజలకు అభివాదం చేశారు.
అంతకంటే ముందే జగన్ కుటుంబ సభ్యులు వేదికపైకి చేరుకున్నారు. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల ప్రజలకు అభివాదం చేశారు. సరిగ్గా ముహుర్త సమయానికి ఒక్క నిమిషం ముందు గవర్నర్ నరసింహాన్ దంపతులు వేదికపైకి చేరుకొన్నారు.
తొలుత గవర్నర్ నరసింహాన్ జగన్‌ను ఆలింగనం చేసుకొని అభినందించారు. ఆ తర్వాత జగన్‌తో గవర్నర్ నరసింహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె చీఫ్ స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీఎంకె చీఫ్ స్టాలిన్‌కు జగన్ సోదరి షర్మిల తన తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిని పరిచయం చేశారు.
స్టాలిన్ వచ్చిన కొద్ది క్షణాలకే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వేదికపైకి చేరుకున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు.
జగన్‌తో ప్రమాణం చేయించిన తర్వాత గవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన డీఎంకె చీఫ్ స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను పలకరించారు. ఆ తర్వాత జగన్ కుటుంబ సభ్యులను గవర్నర్ దంపతులు పలకరించారు.
ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె చీఫ్ స్టాలిన్ తదితరులు అభినందించారు.








