
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఎన్నికల వేడి తగ్గాక మొదటిసారి విశాఖ వచ్చిన వైఎస్ జగన్కు ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్ కమ్ లభించింది.
వైసీపీ శ్రేణులంతా జగన్ సీఎం అంటూ కలవరించారు. జగన్ వస్తారనే సమాచారంతో విశాఖ విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. వైసీపీ నేతలు క్యాడర్ సైతం అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. దాదాపు అరగంట పాటు అదే హోరు సాగర ఘోషను సైతం దాటి వినిపించింది. ఇక జగన్ కూడా ఫుల్ జోష్తో వచ్చారు.
ఎయిర్పోర్టులో అదిరిపోయే స్వాగతం
ఎక్కడా అయనలోని కాంఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్లుగా కనిపించలేదు. ఆయన రాకలో కూడా ఈసారి గొప్ప మార్పు కనిపించింది. ఇంతవరకూ పార్టీ నేతగా వచ్చిన జగన్ లో కొత్త కళ ఈసారి చూశామని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి రుషికొండలోని ఓ రిసార్ట్స్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు జగన్.
నవవధూవరులను ఆశీర్వదించారు. కల్యాణ మండపంలో వైఎస్ జగన్ను చూసేందుక పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై జగన్, సీఎం అంటూ నినాదాలతో పెళ్లిమండపాన్ని కూడా జగన్ అభిమానులు, కార్యకర్తలు హోరెత్తించారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు.








