23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గెలుపు మూడ్‌లో జగన్, తొలిసారిగా పీకే ఆఫీసుకు, అక్కడేం జరిగిందంటే…

గెలుపు మూడ్‌లో జగన్, తొలిసారిగా పీకే ఆఫీసుకు, అక్కడేం జరిగిందంటే…

- Advertisement -

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి మధ్య చాలా రోజుల వ్యత్యాసం ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఓటర్ల తీర్పు ప్రస్తుతానికి ఈవీఎంలలో భద్రంగా దాగి ఉంది.

మరోవైపు ఏపీలో ఈనెల 11న జరిగిన పోలింగ్‌లో ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదైంది. దీంతో ఈ పరిణామం అధికార పార్టీ వినాశనానికే దారితీస్తుందని వైఎస్సార్సీపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే అధికార టీడీపీ మాత్రం పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం తమకే లాభిస్తుందని అనుకుంటోంది. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.

పీకే కార్యాలయానికి తొలిసారిగా జగన్…

పోలింగ్ ముగిసిన మర్నాడే వైఎస్ జగన్ ఏపీలో తనకు పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బందితో ఆయన మాట్లాడారు. అంతకుముందు లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి పీకే వచ్చారు.

పోలింగ్ సరళిపై వారిద్దరూ కాసేపు చర్చించుకున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఏదో తెలియని సంతోషం. అనంతరం వైఎస్ జగన్ పీకేతో కలిసి ఆయన కార్యాలయానికి బయలుదేరారు.

ys-jagan-meets-pk-after-ap-election-1ఏపీలో జగన్ సుపరిపాలన: పీకే ఆశాభావం

ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు ఆ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఏపీ ప్రజలకు జగన్ సుపరిపాలన అందిస్తారనే నమ్మకం తనకు ఉన్నట్లు చెప్పారాయన. తన కార్యాలయం సిబ్బందికి వైఎస్ జగన్‌ను పరిచయం చేస్తూ.. ఏపీకి కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యానించారు.

అంతకంటే ముందు, జగన్ పీకే కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న తరుణంలోనే ‘‘సీఎం.. సీఎం..’’ అంటూ అక్కడి సిబ్బంది నినాదాలు చేయడంతో వైఎస్ జగన్, పీకే ఇద్దరూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పీకేతో సమావేశం ముగిసిన అనంతరం జగన్ అక్కడ్నించి వెళ్లిపోయారు.

జగన్ పాదయాత్ర వెనుకా పీకే కీలక పాత్ర…

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెనుక కూడా ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని పీకే కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో స్వయంగా వైఎస్ జగన్ గుర్తు చేసుకుంటూ పీకేను అభినందించడం గమనార్హం.

పాదయాత్రతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకోగలిగానని వైస్ జగన్ వ్యాఖ్యానిస్తూ.. ఇలాగే కష్టపడితే 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తన పాదయాత్ర విజయవంతం కావడం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారంటూ.. అందుకు ఆయన్ని జగన్ అభినందించారు కూడా.

ఇక్కడ్నించి బీహార్‌కు…

2014లో తన వ్యూహాలతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన తన మకాం ఆంధ్రప్రదేశ్‌కు మార్చి వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించారు.

కొన్ని సందర్భాలలో పీకే తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమైనప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకే అలాంటి నిర్ణయాలు చేయాల్సి వచ్చిందంటూ ఆయన సమర్థించుకున్నారు.

పీకే రాజకీయ చాణక్యమే ఫలిస్తుందా?

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగియడంతో ప్రశాంత్ కిషోర్ పని కూడా ఇక్కడ ముగిసినట్లే. ఇక ఆయన తన సొంత రాష్ట్రం బీహార్‌కు వెళ్లి అక్కడ రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెడతారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వైఎస్ జగన్, ప్రశాంత్ కిషోర్‌ల నడుమ మంచి అనుబంధం కొనసాగింది.

వైఎస్ జగన్ ఏపీ సీఎం కావడంలో తన వంతు పాత్రను పోషించానన్న సంతృప్తితో పీకే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆయన రాజకీయ చాణక్యం నిజంగానే పనిచేసిందో లేదో తెలియాలంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే!

- Advertisement -