

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని రాధాకృష్ణ తెలిపారు. ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదన్నారు. గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తన తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లానని వంగవీటి తెలిపారు. విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లావంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి తనను మందలించారన్నారు. విగ్రహావిష్కరణకు వెళ్లనివ్వనివారు ఇంకెక్కడికి వెళ్లనిస్తారని ఆయన నిలదీశారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు.
తాను పార్టీలో చేరిన సమయంలో వైయస్ జగన్.. తనను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటానని హామీ ఇచ్చారని, కానీ, తనను వ్యక్తిగతంగా కించపరుస్తున్న నేతలను సైతం ఆయన వారించలేకపోయారని ఆరోపించారు. తన తండ్రి కన్న కలల గురించి జగన్కు చెప్పిన వేళ.. వాటిని నెరవేర్చేందుకు సహకరిస్తానని చెప్పిన ఆయన, తరువాత స్పందించలేదని రాధా వెల్లడించారు.
జగన్ పద్ధతి మార్చుకోవాలి..: సీఎం గౌరవంగా..
ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని రాధాకృష్ణ సూచించారు. అన్ని కులాలు, మతాలు, పార్టీల్లో రంగా అభిమానులున్నారని రాధా చెప్పారు. తనను చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులు కూడా వచ్చాయని.. ఎవరి దాడులకు భయపడేవాడిని కాదన్నారు. తనకు ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని, రంగా అనే వ్యవస్థను బతికించాలన్నారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజాజీవితంలో కొనసాగాలనుకుంటున్నానని.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేని వైసీపీలో ఎందుకు కొనసాగాలని రాధా ప్రశ్నించారు. అందుకే వైసీపీలో కొనసాగి ఏమీ చేయలేననే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను చెప్పే ప్రతి మాట వాస్తవమని, ఈ విషయంలో వైసీపీలో చాలా మందికి తెలుసన్నారు. కానీ వాళ్లు బయటకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదని రాధా చెప్పారు.
ఆత్మాభిమానం చంపుకొని, అవమానాలు భరిస్తూ ఇన్నాళ్లూ వైసీపీలో కొనసాగామని రాధా తెలిపారు. సీఎం చంద్రబాబు తనను టీడీపీలోకి గౌరవంగా ఆహ్వానించారని రాధా వెల్లడించారు. నీలాంటి వాళ్లు సమాజానికి ఉపయోగపడతారని సీఎం తనతో అన్నారన్నారు. విజయవాడ నగరంలోని వేలాది మంది పేదలున్నారని వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మీడియా ద్వారా సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కోరారు. ఏ పార్టీలో ఉన్నా లేకున్నా తన ప్రజాజీవితం కొనసాగుతుందని చెప్పారు.








