
అమరావతి: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకేం చేయాలా అనే ఆలోచనల్లో లోకమంతా తలమునకలై ఉంటే.. ఆంధ్ర్రప్రదేశ్‌లో రాజకీయం మాత్రం ‘రంగు’లో మునిగితేలుతోంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు దగ్గరినుంచి.. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోల కొట్టివేత, ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు, ట్రాక్టర్ ర్యాలీలు, పూలు జల్లడాలు.. ఇలా అనేక అంశాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలిస్తూనే ఉన్నాయి.
చివరికి రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కూడా రాజకీయాలకు వాడుకోవడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తోంది.
ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేసిన అంశంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించడం లేదు.
రంగుల ‘పంచాయతీ’…
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. పైగా ఇలా రంగులు వేయడానికి జగన్ ప్రభుత్వం రూ.1400 కోట్లు ఖర్చుపెట్టిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
ఇంకేముంది? ఈ అంశం కాస్తా రాద్ధంతంకాగా కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కారు. దీనిపై విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
పంచాయతీ భవనాలకు ప్రస్తుతం ప్రభుత్వం వేయించిన రంగులు తీసివేసి, రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని రంగులు మాత్రమే వేయించాలంటూ తీర్పు ఇచ్చింది.
అయితే ఇందుకు తమకు కనీసం మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చి మూడు వారాల గడువు మాత్రమే ఇచ్చింది.
మళ్లీ అదే తప్పిదం…
ఈ సమస్య ఇలా ఉండగానే జగన్ ప్రభుత్వం మళ్లీ అదే తప్పిదం చేసింది. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల భవనాలకు మళ్లీ పార్టీ జెండా రంగులే వేయించింది.
కాకపోతే ఇందులో చిన్న ట్విస్టు ఉంది. భవనాల కింది భాగంలో ఎర్రమట్టి రంగు వేయించి, దానిమీద తెల్ల రంగుతో గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా కొన్ని బొమ్మలు వేయించారు.
మిగిలిన రంగులన్నీ సేమ్ టూ సేమ్ గతంలో పంచాయతీ భవనాలకు వేసినవే. పైగా ఈ రంగుల విషయంలో వైసీపీ నాయకులు ఈసారి సరికొత్త థియరీ చెబుతున్నారు.
తెరపైకి ‘రంగుల థియరీ’…
కింద ఉన్న ఎర్రమట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమట. ఇక మిగిలిన రంగులకు కూడా వైసీపీ పార్టీ రంగులకు సంబంధం లేదని చెబుతున్నారు.
ఎందుకంటే, వాటిలో నీలి రంగు చేపల ఉత్పత్తికి సంబంధించిన నీలి విప్లవానికి, ఆకుపచ్చ రంగు పంటలకు సంబంధించిన హరిత విప్లవానికి, తెలుపు రంగు పాల ఉత్పత్తికి సంబంధించిన క్షీర విప్లవానికి సాదృశ్యమట. ఇంకేం చెబుతాం లెండి.
కోర్టు ధిక్కారం అవుతుందా?
ఒకవైపు హైకోర్టు క్లియర్‌గా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని రంగులే వేయమని చెప్పినప్పటికీ వాటిని మార్చకుండా అలాగే ఉంచడంతోపాటు మరొక రంగును జతచేసి సరికొత్త నిర్వచనాలు చెబుతుండడమే విడ్డూరంగా ఉంది.
ఇది కోర్టు ధిక్కారం అవుతుందా? అనే విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే.. ఆ విషయాన్ని హైకోర్టు చూసుకుంటుంది.
కాకపోతే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించకుండా.. ఇలా రంగుల రాజకీయంలో పడి.. ప్రభుత్వం తన తప్పిదాన్ని సరిదిద్దుకోకుండా.. చేసినదాన్ని సమర్థించుకోవడానికే ప్రయత్నాలు చేస్తుండడం శోచనీయంమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.








