
నిజంగా జనసేన పార్టీ సంచలనాలేమైనా సృష్టిస్తుందా? ఒకవేళ అటుతిరిగి, ఇటుతిరిగి.. ప్రధాన పార్టీలకేమైనా నష్టం తీసుకొస్తుందా? ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. సమీకరణాలు మారిపోతున్న నేపథ్యంలో.. గెలుపును నిర్ణయించే ఓట్లు.. గ్లాసులో పడిపోతున్నాయా? ‘newsxpress.online’ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
కాకినాడ: రాజకీయ వేడి పెరిగింది. క్షణక్షణానికి సమీకరణాలు మారిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు..రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల పోరులో గత ఎన్నికలను చూస్తే పోటాపోటీగా నిలిచినా తెలుగుదేశం పార్టీ 106 సీట్లు సాధించి అధికార పీఠం ఎక్కింది. 67స్థానాలతో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా రేసులో నిలిచింది. 88 మేజిక్ ఫిగర్ దాటేందుకు.. కేవలం 21 ఎమ్మెల్యే సీట్ల దూరంలో వైసీపీ నిలిచిపోయింది. అదే సేమ్ టైమ్ తెలుగుదేశంలో కూడా అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించినవారు ఉన్నారు. అంటే బొమ్మా-బొరుసా ఆటలో అదృష్ట బొమ్మ ఆరోజున తెలుగుదేశం వైపు పడిందని చెప్పాలి.
ఆరోజున జనసేన పార్టీ పెట్టిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ..తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ వైపు ప్రచారం చేశారు.ఇక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది.. అదేలాగంటే.. ఎక్కడ అతితక్కువ ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారో..
అదంతా నా ప్రతిభేనని పవన్ కల్యాణ్ వాదన..
ఆ చివరి రోజు రైతుల రుణమాఫీ చేస్తానని మా నాయకుడు జగన్ హామీ ఇచ్చి ఉంటే మేమే గెలిచావాళ్లం.. రైతులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయడం వల్ల..ఆ చివరి ఎడ్జ్ అటు తీసుకుంది..అందుకే తెలుగుదేశం గెలిచింది..అంటారు..
ఇది వైసీపీ వాదన…
మా నాయకుడు చంద్రబాబుమీద ప్రజలకి ఉన్న అభిమానం, తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న చిత్తశుద్ధి, కొత్త రాష్ట్ర రాజధాని చంద్రబాబు ఒక్కరే కట్టగలరు..ఆయన విజన్ వల్లే హైటెక్ సిటీ వచ్చింది..అని అంటారు..
ఇది తెలుగుదేశం వాదన…
ఇప్పుడు 2019 ఎన్నికలకు వచ్చేసరికి..
ఎవరూ హామీలదగ్గర రాజీపడటం లేదు.. నువ్వా-నేనా..అన్నట్టు పోటీ పడి మరీ హామీల వర్షం గుప్పించేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశానికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ సొంతంగా ఎన్నికల గోదాంలోకి దూకారు.. దీంతో రెండు ప్రధానపార్టీల మధ్య అంతర్లీనంగా ఆందోళన మొదలైంది. ఇప్పుడిక్కడ రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే ఏయే అంశాలు ఎలా పనిచేస్తాయో విశ్లేషణ చేద్దాం..
పవన్ కల్యాణ్ వల్ల ఆయన సామాజికవర్గం..
ఓట్లు ఎంతోకొంత చీలుతాయి. అయితే సామాజిక వర్గం వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా జిల్లాలైన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అధికంగా.. కష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాక్షికంగా..అనంతపురంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల కారణంగా అక్కడ కొంత ఇలా ప్రభావం ఉంటుందనేది నిర్విదాంశం. ఇప్పుడిక్కడ పార్టీల వారీగా విడిపోయినవాళ్లు కాకుండా మధ్యస్తంగా గా ఉన్నవాళ్లు వేస్తారా? లేక గుంపగుత్తగా పడతాయా?అనేది వేచి చూడాలి
రెండు యువతరం..
ఈరోజు పవన్ కల్యాణ్ కోసం ఎక్కడ చూసినా కుర్రవాళ్లే బండ్లు వేసుకొని స్వచ్ఛందంగా తిరుగుతున్నారు. కచ్చితంగా యువతరం ఓట్లు పవన్ కల్యాణ్ కే పడతాయనడంలో సందేహం లేదు.. లేదంటే మీరు మీఊళ్లలో ఇతర ప్రధానపార్టీలను చూడండి..కుర్రవాళ్లు ఒక్కరు కనిపించడం లేదు. అంతా మధ్యవయస్కులు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఈ యువతరం సెక్షన్ ఓట్లు అటు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ ముఖ్య సంగతి
ఈ యువతరం ఎక్కువగా వైసీపీ వైపు కూడా ఉన్నారు. ఎందుకంటే మైనార్టీ ఓట్లు ఆ పార్టీకి బలమని చెప్పాలి. ఈ మైనార్టీల్లో అధికంగా యువత..సినిమాల పట్ల ఆకర్షితులై ఉండటం..వాళ్లు జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.
ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం..
ఆ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పెంచిదనేది వాస్తవం. ప్రజలందరూ ఒక ఆలోచన చేస్తున్నారు. అవినీతిపరులను పరుగులు పెట్టించిన జేడీలాంటి నిఖార్సయిన అధికారే..ఏ పార్టీ జోలికి వెళ్లకుండా జనసేనలోకి రావడంతో నీతి, నిజాయితీ, సిన్సియారిటీ ఇలాంటివి నమ్మే ఉన్నతస్థాయి ప్రజల ఆలోచనలు మారుతాయని విశ్లేషకుల మాట. ఇలా ఉన్నతస్థాయి వర్గం పవన్ కల్యాణ్ వైపు చేరుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఆఖరుగా సినిమా పిచ్చి..
ఇదెంతవరకు పనిచేస్తుందో తెలీదుగానీ.. ఒకప్పుడురోజుల్లో సినిమావాళ్లంటే జనానికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడూ ఉంది కానీ అది యువతరంలోనే ఉంది. అప్పట్లో మహిళలు కూడా విపరీతంగా అభిమానించేవాళ్లు. ఇప్పుడా సైలెంట్ ఓటింగు ఏమైనా పవన్ కి పడుతుందా? అనేది సందేహాస్పదంగా ఉంది.
ఇన్ని కారణాలు జనసేన గెలుపును శాసిస్తాయా..అంటే చెప్పలేంగానీ.. రెండు ప్రధానపార్టీలకు మాత్రం ఎవరో ఒకరికి నష్టం మాత్రం జరిగి తీరుతుంది. అదెవరికి అంటే..ఇలా ఆలోచించి చూద్దాం..
చిరంజీవి ప్రజారాజ్యం కారణంగా..
తెలుగుదేశం, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలో ఆ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలు కొందరు వెళ్లిపోయారు. అందువల్ల అక్కడ క్యాడర్ గానీ, ఆ ఓటు బ్యాంకుగానీ అన్ని ప్రధానపార్టీలకు తగ్గింది. తదనంతర పరిణామాల్లో జరిగిన ముద్రగడ ఉద్యమం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా ఆలోచించి.. ఆ సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వెయ్యికోట్లు ప్రకటించి తక్షణం వందకోట్లిచ్చి వారిని సాంత్వన చేశారు. అలాగే కేంద్రప్రభుత్వం రిజర్వేషన్లను పెంచినప్పుడు ఆంధ్రాలో 5శాతంలో 2.5శాతం వారికే కేటాయించి తీర్మానం కూడా చేసేశారు. అంతకు ముందు వారికోసం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఓకే చేసి కేంద్రానికి పంపించారు. ఇలా అన్నీ చకచకా చేసి.. ఆ సామాజిక వర్గం తెలుగుదేశం దగ్గరే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
దీంతో టీడీపీపై ప్రభావం తగ్గిందనే విశ్లేషణలు చెబుతున్నాయి..కారణాలు అన్వేషిస్తే..
2014లో తెలుగుదేశానికి మద్దతిచ్చిన పవన్..ఈసారి డైరెక్టుగా పోటీ చేయడం వల్ల..ఈ ఎఫెక్టు ఎంతవరకు తెలుగుదేశానికి తగులుతుందంటే.. పైన పేర్కొన్న కార్పొరేషన్, వెయ్యికోట్లు, రిజర్వేషను బిల్లు ప్రవేశపెట్టడం, నామినేషన్ల పదవులు కట్టబెట్టడం ఇలా వీటన్నింటి విశ్లేషణ ప్రకారం.. ఆ పార్టీపై ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసిందనే చెప్పాలి.. అందులో సందేహమే లేదు..
అలాగే ఒకసారి …
ప్రజారాజ్యం పార్టీతో చావుదెబ్బ తిన్న నాయకులు, రాజకీయ సన్యాసులై పోయినోళ్లు, చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయినోళ్లు.. అందరూ ఈ సారి జనసేన వైపు వెళ్లకుండా బుద్ధిగా ఎక్కడివారక్కడే కుదురుగా కూర్చోవడంతో .. నాయకులు, క్యాడర్ కదలకపోవడంతో తెలుగుదేశానికి అంత ఎఫెక్టు ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు.
ఎటొచ్చి ఇది అటుతిరిగి, ఇటు తిరిగి…
వైసీపీకేమైనా దెబ్బ పడిపోతుందా? అంటే ఆలోచన చేయాల్సి ఉంది. ఎందుకంటే వైపీసీ లో కూడా ఆ సామాజిక వర్గం నేతలున్నారు. యువత ఉంది. అలాగే జనసేనకి వెళ్లిన ఓట్లు ఇక్కడ మైనస్ అయితే.. విజయానికి అందివచ్చే ఆ రెండువేలు, మూడువేల ఓట్లు జారిపోతాయేమోననే సందేహం వారిలో కనిపిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఆరోజన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో సిద్ధాంతపరంగా కూడా కొందరు అక్కడే ఉండిపోయారు. కొందరు ఇటు వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రాలో పల్స్ వీక్ గా ఉండటం వల్ల.. అక్కడా ..ఇక్కడా కూడా సరైన దిక్కులేక వాళ్లు కూడా అల్లాడుతున్నారు.
మొత్తానికి జనసేన ఎవరికి ఎసరు పెడుతుందో తెలీదు కాని.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తాజాగా బుధవారం విశాఖ జిల్లాలో మూడుచోట్ల పెందుర్తి, చోడవరం, అనకాపల్లిలో భారీ బహిరంగ సభలను రద్దు చేశారు. అక్కడ పవన్ కల్యాణ్ మాట్లాడాల్సి ఉంది. మొన్న హైదరాబాద్ లో కేసీఆర్ కి జనం లేరు..ఇక్కడ సినీ స్టార్ కి లేరు. అందువల్ల జనసేన పవన్ కల్యాణ్ వల్ల ఎంత ప్రభావమనేది విశ్లేషణల వరకే పరిమితమైపోతోందని రాజకీయ నేతలు చెబుతున్న మాట..








