విశాఖపట్నం: ఎన్నికల ఫలితాలకి ఇంకా 23 రోజులు సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు..నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్ధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో బూతులుగా వారీగా పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి…పోలింగ్ సరళి ఎలా ఉంది అనే దానిపై అభ్యర్ధుల నుంచి రిపోర్టులు తీసుకొనున్నారు.
ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన లెక్కలని అధినేతకి వివరించేందుకు టీడీపీ నేతలు లెక్కలు సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. జిల్లాలో ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గెలుస్తామో పక్కా లెక్కలతో చంద్రబాబుకి సమర్పించనున్నారని సమాచారం. విశాఖపట్నం జిల్లాలో 3 పార్లమెంటు స్థానాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌లు టీడీపీ ఖాతాలోకే….
ఇక టీడీపీ నేతల లెక్కల ప్రకారం విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుందని నేతలు అంచనా వేస్తున్నారట. అయితే విశాఖ పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని టీడీపీ నేతలు అంగీకరిస్తూనే…జనసేన గెలిచేంత మాత్రం క్రాస్ ఓటింగ్ జరగలేదని అనుకుంటున్నారు.
చదవండి: జగన్‌కి బిగ్ షాక్! చంద్రబాబు గెలిస్తే.. మళ్ళీ అక్కడే ప్రమాణ స్వీకారం!
మహా అయితే ఒక్కో నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ ద్వారా 10 వేలకు మించి ఓట్లు రావని అంచనా వేస్తున్నారు. ఈ ఓట్లు ఆయన విజయానికి దోహదపడవని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మూడో స్థానంకి పరిమితమై అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక అనకాపల్లి పార్లమెంటు విషయానికి వస్తే.. ఇక్కడ టీడీపీ విజయం నల్లేరు మీద నడకే అని లెక్క వేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ చాలా సులువుగా విజయం సాధిస్తారని విశ్వాసం ప్రకటిస్తున్నారు. అయితే అరకు పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ జరిగిందని…గెలుపు ఎవరిదనేది ఇప్పుడు చెప్పలేమంటున్నారు.
అసెంబ్లీ స్థానాల లెక్క ఇదే..
అటు అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే…జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 స్థానాలు టీడీపీ గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక 5 వైసీపీ దక్కించుకునే అవకాశాలు వున్నాయని అంటున్నారు. వైసీపీ నగరంలో ఒకటి…రూరల్ నాలుగు స్థానాలు గెలుస్తుందని చెబుతున్నారు. అటు గాజువాకలో త్రిముఖ పోరు గట్టిగా జరిగిందని…గెలుపు అంచనాకి అందడం లేదంటున్నారు. మరి చూద్దాం టీడీపీ నేతలు వేసే లెక్కలు ఏ మేర నిజమవుతాయో.
చదవండి: సంచలనం: ‘పీకే’ లాస్ట్ సర్వే, ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఇవే…








