అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు పురస్కరించుకుని ఓ పరిశోధనా సంస్థ సర్వే విడుదల చేసిన ఫలితాలు ఇలా ఉన్నాయంటూ ప్రముఖ తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురితం చేసిన కథనంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేర్కన్న ఆ సంస్థ తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేయడమే కారణం. అంతేగాక, తమ పేరును ఉపయోగించి తప్పుడు కథనం ప్రచురితం చేసినందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆంధ్రజ్యోతి తన కథనంలో.. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. కాగా, దొంగ సర్వేతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన టీడీపీ, ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పలువురు ఫిర్యాదులు చేశారు.
లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ ఆగ్రహం
సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కొన్ని గంటల్లోనే లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సంస్థ తీవ్రంగా దించింది. అసలు తాము ఏపీలో ఎలాంటి సర్వే చేయనేలేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇ.వెంకటేశన్ ట్వీట్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ చానళ్లు, ఇతర వెబ్‌సైట్లు ప్రచారంలోకి తీసుకువచ్చిన ఆ సర్వేతో తమ సంస్థకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత కాసేపటికే ఆ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అదే విషయాన్ని వెల్లడించింది.
ఇది ఇలావుంటే.. ‘మా సంస్థ పేరుతో దొంగ సర్వేను ప్రచురించిన పత్రిక, ఇతర చానళ్లు, వెబ్‌సైట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సంస్థ డైరెక్టర్ సంజయ్‌కుమార్ హెచ్చరించారు. ఆ సర్వేతో తమకు సంబంధంలేదని అధికారికంగా ప్రకటన విడుదల చేశామని చెప్పారు. తాను ఢాకాలో ఉన్నానని.. ఢిల్లీకి రాగానే వారికి నోటీసులు జారీ చేయడమే కాక.. ఆయా సంస్థల మీద ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ తెలుగు మీడియాకు వెల్లడించారు.
కాగా, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు పన్నిన పన్నాగంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబు తీరుపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, మేథావులతో పాటు సామాన్యులు కూడా తీవ్రంగా స్పందించారు. తప్పుడు సర్వేను ప్రచారంలోకి తేవడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని కుట్రపన్నిన టీడీపీ, ఎల్లో మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కేంద్ర ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సోమవారం ఫిర్యాదులు చేశారు.
ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
తప్పుడు సర్వేలు ప్రచురిస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురించిన సర్వేను తాము చెయ్యలేదని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సంస్థ అధికారికంగా ప్రకటించినందున దానిని ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న టీడీపీపై సాక్ష్యాలతో సహా ద్వివేదికి ఫిర్యాదు చేశారు.








