
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ సీఈఓ డాకవరం అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు బుధవారం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు.
తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ.. అశోక్ స్పందించకపోవడంతో తాజాగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు.
తొలిసారి ఎథికల్ హ్యాకర్ల సాయం…
ఈ కేసు వ్యవహారంలో పోలీసులు తొలిసారి ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకుంటున్నారు. ప్రధానంగా లాక్ చేసిన అత్యాధునిక కంప్యూటర్లలో ఉన్న డేటాను స్వాధీనం చేసుకోవడానికి ఎథికల్ హ్యాకర్లతో ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పాస్వర్డ్ ప్రొటెక్టివ్‌గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్ చేసిన ఎథికల్ హ్యాకర్లు వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఏపీలో జరిగిన గత ఉప ఎన్నికల్లో సేవామిత్ర యాప్‌ను ట్రయల్ రన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, సేవామిత్ర యాప్‌నకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని గూగుల్ ప్లే స్టోర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ.. టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్ వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ కేసు విచారణకు ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ చిక్కితేనే దర్యాప్తులో కీలక పురోగతి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.
చదవండి: డేటా స్కాం తీవ్రమైంది: ‘చంద్రబాబు దొంగ’ అంటూ జగన్ నిప్పులు








