
విజయవాడ: గురుపూజోత్సవం సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘‘గురువులందరికీ వందనాలు నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనాలు..’’ అని వ్యాఖ్యానించారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ ఆదర్శమని కొనియాడారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించేవారని గుర్తు చేసుకున్నారు.
‘‘గురువుకు సాటి ఎవరూ లేరు..’’
గురువు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో ఒక పాఠశాలను కూడా స్థాపించారని తెలిపారు. ఇప్పటికీ ఆ పాఠశాలను వైఎస్సార్ ఫౌండేషన్ నడుపుతోందని అన్నారు. గురువుకు సాటి ఎవరూ ఉండరని, గురువు విద్యార్థుల గుండెపై ముద్ర వేయగలరు అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది సీఎంగా తన లక్ష్యమని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఎకానమీ లెక్కల ప్రకారం మన దేశంలో కాలేజీ స్థాయి చదువులకు వెళుతున్న విద్యార్థులు కేవలం 36 శాతమేనని వెల్లడించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నామని, తల్లిదండ్రులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మార్పులు తెస్తామని, ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు తాపత్రయపడుతున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలని కోరుకునే స్థాయిలో విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు సీఎం జగన్ అవార్డులు అవార్డులు బహూకరించారు.








