టీడీపీ షాకింగ్ డిమాండ్: ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఫ్యాన్లు’ ఉండొద్దు! ఎందుకో తెలుసా?

TDP wants ceiling fans removed from govt offices as they might ‘influence voters’, Newsonline

చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకులు వింత డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫ్యాన్లను తీసేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం టీడీపీ నేతలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనీ.. ఎన్నికల గుర్తును సూచించే వస్తువులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండరాదని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ విషయమై వారు స్థానిక తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన తహసీల్దార్.. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి నివేదిస్తామని వారికి హామీ ఇచ్చారు. అయితే, రామకుప్పం టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడానికి ఓ కారణం కూడా ఉంది.

మరి ఫ్యాన్లకు కోడ్ వర్తించదా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిదంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను అధికారులే తొలగించారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫ్యాన్లపై పడ్డారు. చంద్రబాబు ఫోటోలకు వర్తించే ఎన్నికల కోడ్ వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు అయిన ‘ఫ్యాన్’కు ఎందుకు వర్తించదని వారు ప్రశ్నించారు. చంద్రబాబు ఫొటోలను తీసివేసిన అధికారులు మరి ఫ్యాన్లు కూడా తీసివేయాలి కదా? అంటూ లాజిక్ తెరపైకి తెచ్చారు.  దీంతో అధికారులే అవాక్కయ్యారు.