
విజయవాడ: గత కొన్ని రోజులుగా టీడీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని….నిన్న చంద్రబాబు అప్పగించిన లోక్‌సభ విప్ పదవిని తిరస్కరించిన విషయం తెల్సిందే. దీంతో నానినీ బుజ్జగించేందుకు మరో ఎంపీ గల్లా జయదేవ్ రంగంలోకి విప్ పదవిని తిరస్కరించడానికి గల కారణాలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి కేశినేని నానిని తన వద్దకు రప్పించుకుని ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. అయితే చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైన నాని, పార్టీ అధినేతతో తన సమస్యలు ఏకరవు పెట్టారు.
ఈ ఐదేళ్ల కాలంలో పార్టీలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, అసంతృప్తి కలిగించిన ఘటనలను చంద్రబాబుకు వివరించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మరోసారి లోక్ సభ విప్ గా బాధ్యతలు తీసుకోవాలని చంద్రబాబు కోరినా నాని మనసు మార్చుకోలేదు.
ఆ పదవులు ఏం వద్దు అని తాను ఎంపీగానే కొనసాగుతానని అధినేతకు తేల్చిచెప్పారు. అయితే తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని, పార్టీ కోసం చివరివరకు పనిచేస్తానని కేశినేని కుండబద్దలుకొట్టారు.








