
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే బెయిల్‌పై ఆయన విడుదల అయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. ఫలితాల తర్వాత టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణబాబు మాట్లాడుతూ మోదీ, జగన్‌లపై విరుచుకుపడ్డారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థి విజయ నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో ఆధారంగా కేసు
వీడియోను పరిశీలించిన పోలీసులు రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారంటూ రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. బుధవారం ఈ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బెయిలుపై విడుదల చేశారు.








