చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాలోని భోగోలు గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం నాయకుడు తాడేపల్లి కాంతారావు (54) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంతారావు మరో వ్యక్తితో కలిసి శుక్రవారం బైకుపై భోగోలు నుంచి లింగపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మార్గం మధ్యలోని మఠంగూడెం వద్ద ఎదురుగా వస్తున్న ఇండికా కారు.. వీరు ప్రయాణిస్తోన్న బైకును ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాంతారావు మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతడికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న భోగోలు గ్రామస్థులు, కాంతారావు బంధువులు, తెలుగుదేశం, వైసీపీ నాయకులు భారీగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కాంతారావు కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలచివేసింది.
పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. కాంతారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాడేపల్లి కాంతారావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం అయింది. కాంతారావు మరణంతో భోగోలులో విషాదఛాయలు అలముకున్నాయి.