23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…

విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…

tdp-chief-chandrababu-tweet-on-vizag-gas-lekage-incident
- Advertisement -

హైదరాబాద్: విశాఖపట్నం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌ చేశారు. 

రసాయన వాయువు లీకేజి దుర్ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న చంద్రబాబు.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. 

వెంకటాపురం గ్రామంలోని చెట్ల రంగు కూడా మారిపోయిందంటే విషవాయువు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందన్నారు. ఎన్నో మూగజీవాలు కూడా మరణించాయన్నారు.

సమీప ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని, అత్యున్నత వైద్య సేవలు అందించాలని కోరారు. 

మృతుల కుటుంబాలకు చంద్రబాబునాయుడు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.

తమ ఎమ్మెల్యే గణబాబు కూడా ఉదయం నుంచి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారని, ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన్ని సంప్రదించాలని సూచించారు. 

‘‘విశాఖకు వెళ్తా.. అనుమతించండి..’’

విశాఖలో ఈ ఉదయం చోటుచేసుకున్న రసాయన వాయువు లీకేజి దుర్ఘటన వినగానే చంద్రబాబు చలించిపోయారు. బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలని అనుకుంటున్నానని, ప్రతిపక్ష నేతగా అది తన బాధ్యత అని పేర్కొన్నారు.

అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉండడంతో.. విశాఖకు తన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే విశాఖకు బయలుదేరనున్నట్లు బాబు తెలిపారు.

 

- Advertisement -