హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే సినీనటుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా, ప్రముఖ సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మార్చి 24న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిసింది.
మార్చి 24న నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండటంతో.. అక్కడే శివాజీ రాజా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కాగా, తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు.. శివాజీరాజా మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని చర్చ జరిగింది.
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్..?
అంతేగాక, ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన శివాజీరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ప్రకటించడం గమనార్హం. కాగా, జనసేన లోక్‌సభ అభ్యర్థిగా నాగబాబు నర్సాపురం నుంచి పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ నర్సాపురం ప్రచార సభలోనే శివాజీరాజా వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీరాజా వైసీపీ తరపున ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా రఘురామరాజు పోటీ చేస్తుండటంతో ఆయనకు మద్దుతుగా శివాజీరాజా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.








