మదనపల్లి: పార్టీని వీడి యుద్ధం ప్రకటించడమా? లేక అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించి మౌనం వహించడమా? అన్నది తేల్చుకునేందుకు మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దానికోసం నేడు అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
మదనపల్లె రాజకీయాల్లో ప్రవేశించింది మొదలు తిప్పారెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌నే నమ్ముకుని కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన మరణంతో వైఎస్ తనయుడు జగన్ వెంట నడిచారు. వైసీపీ తరపున ఎన్నికలు ఎదుర్కొన్న తొలి నేతగా చరిత్ర సృష్టించారు. అలాగే ఆ పార్టీ తరపున శాసనమండలిలో అడుగుపెట్టిన తొలి ప్రజాప్రతినిధిగా కూడా రికార్డులకెక్కారు.
టీడీపీలోకి వెళ్తారా…
తర్వాత గత ఎన్నికల్లో అదే పార్టీ తరపున పోటీ చేసి మదనపల్లె నుంచీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఐదేళ్ళు గడిచేసరికి పార్టీ అధిష్ఠానం నుంచీ చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి మూడు రోజుల ముందు వరకూ కనీస పాటి ప్రతికూల సంకేతాలు కూడా ఆయనకు అధిష్ఠానం నుంచీ అందలేదు. దీంతో ఆయన టికెట్‌పై ఎంతో ధీమాతో వుండిపోయారు. కానీ షెడ్యూలు విడుదలకు మూడు రోజులముందు పిడుగులాంటి సమాచారం అందుకున్నారు.
మదనపల్లెలో ముస్లిం మైనారిటీల ఓట్లు అధికంగా వున్నందున ఆ వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇస్తున్నామని, అతని గెలుపునకు కృషి చేస్తే భవిష్యత్తులో మంచి పదవి, గుర్తింపు ఇస్తామని తేల్చి చెప్పేశారు అధినేత. ఇక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడమే తరువాయి అని సంసిద్ధంగా వున్న డాక్టర్‌కు అధిష్ఠానం షాక్ ఇచ్చింది. తర్వాత కూడా ఒకట్రెండు ప్రయత్నాలు చేసిన డాక్టర్‌కు ఎలాంటి ఆశావహ పరిస్థితీ కనిపించలేదు. దీంతో ఆయన ప్రత్యామ్నాయం దిశగా దృష్టి సారించారు.
ఎదురుగా వున్న అవకాశాలు రెండు. ఒకటి టీడీపీలో చేరడం. మరోటి జనసేన టికెట్ కోసం యత్నించడం. అయితే గతంలో పలుమార్లు టీడీపీ సీనియర్ నేతలు ఆయన్ను పార్టీలో చేరమని సంప్రదింపులు జరిపారు. కానీ ఆయా సందర్భాలలో డాక్టర్ సమాధానం దాటవేస్తూ వచ్చినట్టు సమాధానం. దీంతో సంప్రదింపులు జరిపిన పార్టీ నేతలు ఇపుడు ఆయన టీడీపీలో చేరకుండా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీలో చేరడానికైతే పరవాలేదు కానీ టికెట్ ఇవ్వడం మాత్రం కుదరదని వారు ముందుగానే చెప్పేసినట్టు తెలిసింది. దీంతో జనసేనలో చేరేందుకు యత్నిస్తున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. పార్టీ అభ్యర్థిని ఓడించి అధిష్ఠానం మీద కసి తీర్చుకోవాలనే పట్టుదల ఆయన సన్నిహితుల్లో కనిపిస్తోంది.
ఎన్నికలకు సమయం లేనందున డాక్టర్ తన భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకునేందుకు ఆలస్యం చేసే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై నియోజకవర్గవ్యాప్తంగా జనం ఆసక్తిగా చూస్తున్నారు








