
గుంటూరు: ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు…తాజాగా బీజేపీ పార్టీలో చేరారు. మొన్న తిరుపతిలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
అనంతరం సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ…పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ తన సలహాలు, సూచనలు తీసుకోలేదని కిశోర్ బాబు అన్నారు.
అసలు పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా తనకు దొరికేది కాదని, ఫోన్లో కూడా మాట్లాడే వారు కాదని చెప్పారు. పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై చర్చించేందుకు పవన్ కల్యాణ్ తనకు ఎప్పుడూ అవకాశమివ్వలేదని విమర్శించారు.
ఇక టీడీపీ, జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని గ్రామీణ స్థాయి వరకూ ప్రచారం జరిగిందని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అన్నారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టవుతుందని, మళ్లీ అవినీతి టీడీపీకే పట్టం కట్టాల్సి వస్తుందని ప్రజలు భావించారని అన్నారు. అందుకే ప్రజలు చంద్రబాబును, టీడీపీని పక్కనబెట్టి, వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పారు.
అయితే పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజంలో మార్పు తీసుకురావాలన్న తపన చాలా గొప్పవని అన్నారు. అవినీతి రహిత పరిపాలన, సమసమాజ నిర్మాణం పవన్ ఆశయమని, ఈ ఆశయం నెరవేరాలంటే అధికారాన్ని అందుకోవాలని, అధికారంలో లేకుండా ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ వృథానే అని అన్నారు.








