29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ దేశాన్ని బలహీనపర్చొద్దు, అవినీతిపరుల ఆటలు సాగవు: మోడీ హెచ్చరిక

దేశాన్ని బలహీనపర్చొద్దు, అవినీతిపరుల ఆటలు సాగవు: మోడీ హెచ్చరిక

- Advertisement -

ap bjp
విశాఖపట్నం: తాము అవినీతిలేని పాదర్శక పాలనను అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకే తాము ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు. రైల్వే మైదానంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధాని మాట్లాడారు. మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.

‘అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతమిది. తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిథ్యం వహించిన నగరమిది. పారిశ్రామికంగా, పర్యాటకంగా దేశాభివృద్ధిలో విశాఖది ప్రధాన పాత్ర’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కోట్లమంది యువత ఆకాంక్షలు నెరవేర్చే నగరం విశాఖ అని అన్నారు. దశాబ్దాల నాటి విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేశారని చెప్పారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ బాగా అభివృద్ధి చెందుతుందని.. దీంతో ఈ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని అన్నారు. విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తున్నామని మోడీ తెలిపారు. ఐఐఎం, పెట్రోలియం కాంప్లెక్స్, లాజిస్టిక్స్ హబ్ తీసుకొచ్చామని వివరించారు. విశాఖ రిఫైనరీ ఆధునీకరణ పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

అవినీతి పరుల ఆటలు సాగవు.. దేశాన్ని బలహీనపర్చేలా విపక్షాలు

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే అవినీతి నేతల ఆటలు సాగవన్నారు. భావసారుప్యత లేని కూటమితో సమర్థవంతమైన పాలన సాధ్యం కాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అవినీతి చేసే వాళ్లకే భయం… నాకు ఎలాంటి భయం లేదన్నారు.

రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు అవినీతిలో కూరకుపోయాయి. ఇక అవినీతి పరుల ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. అందుకే వాళ్లకు మా ఫైళ్లు ఎక్కడ తెరుస్తారని భయ పట్టుకుందని తెలిపారు. తాను అంకితభావంతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇప్పడు రాష్ట్రాన్ని పాలిస్తున్న అధినేత ఎన్నోసార్లు యూ టర్న్ తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. ఆయన ఎలాంటి నాయకులతో జతకట్టారో మీరే చూస్తున్నారని తెలిపారు.

తనకు సొంత ఎజెండా ఏమి లేదని.. పేద, బడుగు వర్గాల అభివృద్ధే తన ద్యేయమని మోడీ అన్నారు. దేశంలోని రైతుల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్‌‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ ఎండిగడితే… దేశంలోని విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పాకిస్థాన్ పార్లమెంటులో మీ గురించి మాట్లాడారని విమర్శించారు.

మోడీని దింపేందుకు మీరు చేసే పనితో దేశం మొత్తం బలహీనపడుతుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ మాటలు శత్రుదేశం నైతిక స్థితిని పెంచేవిగా ఉన్నాయని తెలిపారు. బలహీనమైన కూటమి బలమైన పాలన ఎలా అందిస్తుందని ప్రజలు ఆలోచించాలని ప్రధాని కోరారు.

ఏపీలో కొందరి నేతల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా టీడీపీ నేతలనుద్దేశించి మోడీ విమర్శించారు. కొంతమంది పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ నేతల వ్యాఖ్యలతో సైనికుల స్థైర్యం దెబ్బతింటుందని.. దేశాన్ని కించపరిచే నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. తమ మాటలతో ఆ నేతలు భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశం చాలాకాలంగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని.. ఇంకెంతమాత్రం ఉపేక్షించేలేది లేదన్నారు మోడీ. ఉగ్రవాద బాధ్యులను శిక్షించాలని దేశం యావత్తూ నినదించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. పుల్వామా దాడి జరిగినప్పుడు మన సాహస సైనికులు ఏం చేశారో కూడా చూశారని తెలిపారు. సాయుధ బలగాలకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. ఇదే న్యూ ఇండియా అంటే.. అని మోడీ వ్యాఖ్యానించారు.

చదవండి: సెల్యూట్: అభినందన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోడీ, ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు

- Advertisement -