28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తోట, నాదెండ్లకు సీట్ల ఖరారు: చంద్రబాబు, జగన్‌కు పవన్ కళ్యాణ్ పిలుపు, కేసీఆర్‌తో భేటీపై ఏమన్నారంటే.?

తోట, నాదెండ్లకు సీట్ల ఖరారు: చంద్రబాబు, జగన్‌కు పవన్ కళ్యాణ్ పిలుపు, కేసీఆర్‌తో భేటీపై ఏమన్నారంటే.?

pawan kalyan
- Advertisement -

గుంటూరు: తాను కేవలం అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పదవులే కావాలనుకుంటే.. ఎప్పుడో ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుడేవాడినని చెప్పారు. గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో ‘జనసేన శంఖారావం’ పేరిట నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. అవినీతి రాజకీయాలతో విసిగిపోయామని, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నారు. అందుకే జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఎప్పటికైనా రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అప్పట్లో పెట్టినట్లు తెలపారు. తన దగ్గర డబ్బుల్లేవని, ప్రజాదరణ మాత్రమే ఉందన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడే సత్తా ఉందని, అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

వ్యవస్థలో అవినీతి ప్రక్షాళన జరగాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అమరావతిలో జనసేన జెండా పాతి తీరుతామన్నారు. జనసేనను అణచివేయడానికి ఎన్ని వ్యూహాలు వేసినా ప్రతి వ్యూహాలు తానూ వేస్తానని చెప్పారు. ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేద్దాం గానీ.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాలపై కలిసి పోరాటం చేద్దామని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

‘వచ్చే 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉండాలని జగన్‌ అనుకుంటున్నారు. చంద్రబాబు కూడా మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత తన కుమారుడు అధికారం చేపట్టాలని చూస్తున్నారు. వీరెవరూ క్షేత్రస్థాయిలో వాస్తవాలను పట్టించుకోవడం లేదు. 2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నా’ అని పవన్ తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్‌లతో భేటీపై పవన్ కళ్యాణ్

‘ఇటీవల తెలంగాణకు చెందిన నేతల(సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్)తో నేను మాట్లాడితే ఏవోవో మాట్లాడుతున్నారు. నాకు పోరాటం చేసే వాళ్లన్నా.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులన్నా గౌరవం. అంతే తప్ప ఏ రోజూ కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో పవన్ కళ్యాణ్ తాజా రాజకీయాలపై చాలాసేపు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అంతేగాక, ‘ఈ రాజకీయ క్షేత్రంలో ఎవ్వరూ మనల్ని ఎదగనివ్వరు. జనసేనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వ్యూహాలు వేస్తారో వేసుకోండి. అందుకు ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్‌ కల్యాణే కాదు. 2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయం’ అని జనసేనాని ధీమా వ్యక్తం చేశారు.

తోట, నాదెండ్లకు స్థానాలు ఖరారు: టీడీపీ, వైసీపీలకు పిలుపు

తమ పార్టీ నేతలైన తోట చంద్రశేఖర్‌, నాదెండ్ల మనోహర్‌ పోటీచేసే స్థానాలను పవన్ ప్రకంటించారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు నుంచి తోట చంద్రశేఖర్‌, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌ పోటీచేస్తారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మరిచిపోయిందని, చంద్రబాబుకు ఆ విషయం ఆరు నెలలకోసారి గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామని పిలిస్తే వైసీపీ నాయకులు కలిసి రావడం లేదన్నారు. ఎన్నికల్లో కావాలంటే విడిగా పోటీ చేద్దామని, ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం కోసం కలిసి పనిచేద్దామని టీడీపీ, వైసీపీలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ నాయకుల వెన్నులో వణుకుపుట్టేలా కలిసి పోరాడదాం’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

‘పగలంతా జనసేనలో తిరిగి రాత్రిళ్లు టీడీపీలో తిరుగుతారు. నా పక్కన కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తుల వల్లే ప్రజారాజ్యం కనుమరుగైంది. అవినీతి పరులు కూడా మన పార్టీ లోకి రావొచ్చు. వాళ్లు అవినీతి పరులని తెలిసినా మనం పోటీకి దింపక తప్పదు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలోకి దిగాల్సిందే. ఒక నాయకుడికి నమస్కారం పెడితే ఆ పార్టీతో కలిసిపోయామని ప్రచారం చేస్తున్నారు. నేనేం చేయాలనుకున్నా అది ప్రజలకు చెప్పే చేస్తా. నేను మీకు అండగా ఉంటా. మీరు నాకు అండగా ఉండండి’ అని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -