23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ దొడ్డిదారిన కాదు, రాజమార్గంలోనే: నాగబాబుకు కండువా కప్పిన జనసేనాని, పోటీ ఎక్కడ్నుంచంటే..?

దొడ్డిదారిన కాదు, రాజమార్గంలోనే: నాగబాబుకు కండువా కప్పిన జనసేనాని, పోటీ ఎక్కడ్నుంచంటే..?

- Advertisement -

అమరావతి: ప్రముఖ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు(నాగబాబు) జనసేన పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకున్న రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలయిందని తెలిపారు.

దొడ్డిదారిన కాదు.. రాజమార్గంలోనే..

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని వ్యాఖ్యానించారు.

నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ తెలిపారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అందుకే నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీకి దించుతున్నామని ప్రకటించారు.

అన్నింటిని వదులుకుని తన పిలుపు మేరకు తన సోదరుడు నాగబాబు రాజకీయాల్లోకి వచ్చారని పవన్ తెలిపారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన నాగబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి కూడా నాగబాబు ఆయనకు మద్దతుగానే ఉన్నారు. తమ్ముడు ఎప్పుడు పిలిచినా తాను వెళతానని గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో నాగబాబు పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

- Advertisement -