
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, పూర్తి మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన కోనం విశాఖపట్నం వచ్చిన ఆమె… బుధవారం జనసేన అధినేత పవన్‌తో కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
స్వాతంత్య్రం అనంతరం ఎక్కువకాలం కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉందని, తెలంగాణ విడిపోయాక ఇక్కడ ఆంధ్ర ప్రజలకి సరైన న్యాయం, అభివృద్ధి జరగలేదన్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏమీచేయలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు.
పవన్ కళ్యాణ్‌కు అవకాశం ఇవ్వాలి…
పవన్ కళ్యాణ్ యువకుడు, కర్తవ్య దీక్ష ఉన్నవాడు, ప్రజలకి మార్పు చేయాలనే సంకల్పంతో ఉన్నారు.. ఇక్కడ కొత్తరకం రాజకీయాలు పరిచయం చేయాలని చూస్తున్నారని, అందుకే మేం కూడా ఒక ఆలోచన చేసి పొత్తుకి వచ్చామని మాయావతి స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో కలసి ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని, ఆలోచించి ఓటువేయాలని మాయావతి విజ్ఞప్తి చేశారు.
‘నేను యూపీకి నాలుగుసార్లు సీఎంగా చేశాను.. అల్ప బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేయాలనేది మా ప్రధాన లక్ష్యం’ అని మాయావతి తెలిపారు. ఇక మా పొత్తు లక్నోలో కుదిరిందని.. లక్నో బీఎస్పీ హయంలో పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీకి అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు మాయావతి.
కేంద్రంలో ప్రజలకి మంచి చేసేవారు ఉండాలన్న మాయావతి… బీజేపీ, కాంగ్రెస్‌లా మోసం చేసేవారు వద్దని చెప్పారు. ఉత్తరప్రదేశ్ మోడల్ దేశం మొత్తం మీద ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడించారు. మా ప్రణాళికలు ఒక్క పేదలకు, దళితులకే కాదు… అన్ని వర్గాల ప్రజలకీ మేలు చేస్తుందన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని మాయావతి హామీ ఇచ్చారు. ఏపీకి అన్ని విధాలా న్యాయం చేస్తామని వివరించారు.
చదవండి: తెలంగాణలో చిరంజీవి ఎన్నికల ప్రచారం! ఎవరి కోసమో తెలుసా?








