అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన జనసేన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ.. కేంద్రం మళ్లీ కేసులను తవ్వితే రాష్ట్రానికి మీరేం న్యాయం చేయగలరంటూ ఆయన జగన్‌ను ప్రశ్నించారు.
జగన్ బీజేపీ, టీఆర్ఎస్ పార్టనర్…
వైసీపీని ఎదుర్కొనే బలం టీడీపీకి లేదన్న పవన్.. జగన్ బీజేపీ, టీఆర్ఎస్ పార్టనర్ అని విమర్శించారు. ‘‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబును సపోర్ట్ చేశాను. ఒకవేళ మద్దతు ఇస్తే ముందుగానే చెబుతాను. మగాడిలా సపోర్ట్ చేస్తాను. దొడ్డి దారిన చేయను..’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
టీడీపీ, వైసీపీలతో పొత్తు ఉండదని ఏడాదిగా చెబుతున్నాను. మీలాగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, మోడీ కాళ్లు పట్టుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని జగన్‌ను ఉద్దేశించి పవన్ ఘాటు విమర్శలు చేశారు. ‘‘జనసేనకు ఎన్ని సీట్లొస్తాయో లేదో తెలీదు. నాకు మాత్రం మీ ఆశీస్సులే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎవరెవర్నో నమ్మారు. ఈ ఒక్క ఎన్నికల్లో జనసేనను నమ్మండి.. ఓటేయండని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జగన్ నిజంగా రాయలసీమ అభివృద్ధిని కోరుకుంటే అసెంబ్లీకి వెళ్లాలి. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లాలి. నా దగ్గర ఒక్క ప్రజాప్రతినిధి లేకున్నా పోరాడాను. రాజకీయాల్లోకి సామాన్యులు రాకూడదా? వైఎస్ కుటుంబం, నారా కుటుంబం మాత్రమే రాజకీయాల్లో ఉండాలా? అని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. టీడీపీ భూకబ్జాలతో నిండిపోయింది. జనసేన సామాన్యులకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండని పవన్ ఓటర్లను కోరారు.
అనంతపురం దత్తత తీసుకుంటాం…
గోదావరి జిల్లాలను మించి అనంతపురం జిల్లా ఎదగాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే, రాయలసీమలో వలసలను నివారిస్తామని, సౌభాగ్య రాయలసీమ పథకం ప్రారంభిస్తామని అన్నారు.
అంతేకాదు, తాను సీఎం అయితే, అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారు.
ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు కట్టించి ఇస్తామని, సొంత మగ్గాలు లేని వారికి మగ్గాలు అందజేస్తామని, యువ రైతులను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటానని, పరిశ్రమలు తీసుకొస్తానని, మండలానికో వృద్ధుల ఆదరణ నిలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.








