రైతులపై వరాలు, పీజీ వరకు ఉచిత విద్య: ఇదీ పవన్ జనసేన మేనిఫెస్టో

Pawan Kalyan releases Jana Sena manifesto, Newsxpressonline

రాజమహేంద్రవరం: తమది ప్రజా మేనిఫెస్టో అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, యువతపై వరాలు కురిపించారు.

జనసేన మేనిఫెస్టోలని కీలక అంశాలు..

తాము అధికారంలోకి వస్తే 60ఏళ్లు దాటిన రైతులకు రూ.5,000 పింఛను ఇస్తామని జనసేన హామీ ఇచ్చారు. పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామని, ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచుతామని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీలకు, మహిళలకు రాజకీయ కోటా ఇస్తామని వెల్లడించారు.

ప్రతి కుటుంబానికీ ఇంటి సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామని ప్రకటించింది.

ప్రజాపోరాట యాత్రలో ఎన్నో సమస్యలను గుర్తించామని, అవన్నీ క్రోడీకరించి అధ్యయనం చేసి మేనిఫెస్టో రూపొందించామన్నారు. రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, రైతులకు సాగు సాయంగా ఆదుకునేందుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఎకరానికి అందిస్తామన్నారు.

అరవై సంవత్సరాలు పైబడిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు నెలకు రూ.5వేలు పించన్ ఇస్తామన్నారు. వివిధ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని, ఎస్‌ఈజడ్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన రైతులకు పారిశ్రామీకరణలో భాగస్వాములను చేసి లాభాలు వచ్చేలా చేస్తామన్నారు పవన్.

రూ. 5వేల కోట్ల పెట్టుబడితో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిద్వారా ప్రతి మండలంలోనూ శీతల గిడ్డంగులు, ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయం వంటికి కల్పిస్తామన్నారు. రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందిస్తామన్నారు.

నదులను అనుసంధానం చేసి రిజర్వాయర్లకు మరమ్మతులు చేయడం, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేస్తామన్నారు. విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఉచితంగా రవాణా సదుపాయం కూడా ఇస్తామని తెలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ, మండలాల్లో గానీ ఆర్ట్సు, అండ్ సైన్స్ కాలేజీలు, వ్యవసాయ కళాశాలలు, పోలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షలకు కులాల ప్రాతిపదికన కాకుండా అన్ని పరీక్షలకు ఫీజు చెల్లించే విధంగా ఏడాదిలో ఒకసారే కట్టించుకుని అన్ని పరీక్షలు రాసే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. కులాలు, మతాల పేర్లతో హాస్టళ్లు, స్కూళ్ళు కాకుండా కామన్ హాస్టళ్లు, కామన్ విద్యా సంస్థలు నెలకొల్పుతామన్నారు.

వృత్తి కళాశాలల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు, వెలివేట్ హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని విభాగాల్లో ఇప్పటికే గుర్తించిన లక్ష బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సంవత్సరానికి పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐటి, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ తదితర రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు.

ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తోన్న బడ్జెట్ కంటే జనసేన బడ్జెట్ దాదాపు రెండింతలు పెంచి కేటాయిస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. మండలానికొక మొబైల్ డయాలసిస్ సెంటర్‌ను, ప్రతీ మండలానికి 70 పడకలు ఆసుపత్రిని నెలకొల్పుతామన్నారు. చిరు వ్యాపారులకు రూ.5వేలు పెట్టుబడి అప్పు కల్పిస్తామన్నారు. పీసీఎఫ్‌ను రద్దు చేస్తామన్నారు.

కాపులకు 9వ షెడ్యూల్‌లో ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన విషయమని, ఎస్సీ, ఎస్టీలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాయలసీమలో వెనుకబడిన ముస్లిం మైనార్టీలను ఆదుకుంటామన్నారు. బంగారం తాకట్టుకు యాభై పైసల వడ్డీకే కల్పిస్తామని, ఏడాది లోపు తీర్చేసేలా ఉంటే పావలా వడ్డీయే వసూలు చేసేలా చేస్తామన్నారు.

మత్య్సకారులకు ఫిషరీస్ డవలప్‌మెంట్ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. మత్య్స వేట నిషేద సమయంలో 300 రోజుల ఉపాధి భృతి కల్పిస్తామని, తుపాన్లు వంటి సమయంలో వేటలేనపుడు రోజుకు రూ.500 చొప్పున ఇస్తామని, జనసేన అధికారంలోకిచ్చిన రెండేళ్ళలోనే అన్ని మత్య్సకార గ్రామాల్లో రక్షిత మంచినీటిని కల్పిస్తామన్నారు. మత్య్సకారులకు ఫిషింగ్ హార్బర్లలో ప్రత్యేక జెట్టీలు, డీప్‌సీ ఫిసింగ్‌కు ప్రత్యేక ఆధునిక మరబోట్లు ఒక ప్రత్యేక సంస్థ ద్వారా అందిస్తామన్నారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, పంచాయతీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు సైతం ప్రాధాన్యత ఇస్తామని, మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, సంక్రాంతితోపాటు ఏ పండగైనా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామన్నారు. మండలానికొక కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు.

ఉద్యోగాలు చేసే మహిళల పిల్లల సంరక్షణకు ప్రభుత్వమే శిశు సంరక్షణా కేంద్రాలు నడుపుతుందన్నారు. రెల్లి కులానికి అండగా ఉంటామని, రెల్లి యువతకు రూ.50వేల వరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని, యాభై శాతం సబ్సిడీపై ఆటోలు ఇస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.